అక్టోబర్ 30న హుజూరాబాద్ ఉపఎన్నికకు ముహూర్తం ఖరారవడంతో టిఆర్ఎస్ పార్టీ తదనుగుణంగా ఎన్నికల ప్రచారాన్ని ఉదృతం చేయబోతోంది. ఇప్పటికే మంత్రి హరీష్‌రావు ఆగస్ట్ 11వ తేదీ నుంచి హుజూరాబాద్ మకాం వేసి జోరుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. జిల్లాకు చెందిన మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, బాల్క సుమన్, నన్నపనేని నరేందర్, ఆరూరి రమేష్, చాలా ధర్మారెడ్డి, సండ్ర వెంకట వీరయ్య తదితరులు, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, నారదాసు లక్ష్మణ్ రావు తదితరులు నియోజకవర్గంలో జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితులలో ఈ ఉపఎన్నికలో టిఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను గెలిపించుకోవాలనే పట్టుదలతో టిఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు అందరూ కృషి చేస్తున్నారు.
అయినప్పటికీ ఈ ఉపఎన్నికలో ఈటల రాజేందర్ వంటి బలమైన ప్రత్యర్ధిని ఎదుర్కోవలసి ఉన్నందున, పోలింగ్‌కు రెండు మూడు రోజుల ముందు సిఎం కేసీఆర్ హుజూరాబాద్‌లో ఎన్నికల సభ నిర్వహించబోతున్నట్లు సమాచారం.
ఈటల రాజేందర్ టిఆర్ఎస్ నుంచి బహిష్కరించబడిన తరువాత సిఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు, గంగుల కమలాకర్ తదితరులపై చేస్తున్న తీవ్ర విమర్శలు, ఆరోపణలతో టిఆర్ఎస్ ప్రతిష్ట మసకబారుతోంది. కనుక ఈ ఉపఎన్నికలో టిఆర్ఎస్ కేవలం గెలుపు కోసమే కాక ఈటల రాజేందర్‌పై రాజకీయ ప్రతీకారంతో కూడా పోరాడుతోంది. మరోపక్క ఈటల రాజేందర్ కూడా ఈ ఉపఎన్నికలో టిఆర్ఎస్‌ను ఓడించడం ద్వారా సిఎం కేసీఆర్‌పై రాజకీయ ప్రతీకారం తీర్చుకోవాలని చాలా పట్టుదలగా ఉన్నారు. కనుక ఆయన కూడా సర్వ శక్తులు ఒడ్డి పోరాడుతున్నారు. కనుక ఈ ఉపఎన్నిక కురుక్షేత్ర మహాసంగ్రామాన్ని తలపించవచ్చు.