అభ్యర్ధిపై ఇంకా మీనమేషాలు లెక్కిస్తున్న కాంగ్రెస్‌

September 28, 2021


img

హుజూరాబాద్‌ ఉపఎన్నికకు ఈసీ ఈరోజు షెడ్యూల్ ప్రకటించింది. అక్టోబర్ 1 నుంచి 8వ తేదీ వరకు నామినేషన్లకు గడువు ఇచ్చింది. అక్టోబర్ 30న ఎన్నిక నిర్వహించి నవంబర్‌ 2న ఫలితాలు ప్రకటిస్తామని తెలిపింది. 

టిఆర్ఎస్‌, బిజెపిలు నామినేషన్లకు సిద్దంగానే ఉన్నాయి. హుజూరాబాద్‌లో జోరుగా ఎన్నికల ప్రచారం కూడా చేస్తున్నాయి. కానీ కాంగ్రెస్‌ పార్టీ ఇంతవరకు అభ్యర్ధిని ఖరారు చేయలేదు కనీసం హుజూరాబాద్‌లో ఎన్నికల ప్రచారం కూడా మొదలుపెట్టలేదు. 

పీసీసీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌ దామోదర రాజనర్సింహా ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, “ఈ ఉపఎన్నికలో పార్టీ తరపున పోటీ చేసేందుకు 19 మంది దరఖాస్తు చేసుకొన్నారు. వారిలో నాలుగు సామాజిక వర్గాలకు చెందిన నలుగురు అభ్యర్ధులను ఎంపిక చేశాము. వారి పేర్లను పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డికి పంపించాము. ఈనెల 30వ తేదీన భూపాలపల్లిలో కాంగ్రెస్‌ సభ ఉన్నందున దాని తరువాత నలుగురు అభ్యర్ధుల గురించి చర్చించి వారిలో ఒకరిని ఖరారు చేస్తాము,” అని చెప్పారు. 

హుజూరాబాద్‌లో నెలకొన్న ప్రత్యేక రాజకీయ పరిస్థితులు, పోటీ కారణంగా ఈ ఉపఎన్నికపై కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. కనుక ఉపఎన్నికలో పోటీ చేశామని చెపుకోవడానికి నామ్ కే వాస్తే... ఆ నలుగురిలో ఒకరిని ఖరారు చేసి ప్రకటించే అవకాశం ఉంది.


Related Post