కేటీఆర్‌ అన్నీ మాట్లాడారు కానీ నోటిఫికేషన్ల ఊసేది?

September 28, 2021


img

రాష్ట్ర ఐ‌టి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ సోమవారం శాసనసభలో సుదీర్గంగా ప్రసంగిస్తూ రాష్ట్రంలో జరుగుతున్న పారిశ్రామిక అభివృద్ధి గురించి వివరించారు. ప్రైవేట్ కంపెనీల ద్వారా రాష్ట్రంలో సుమారు 19 లక్షల మంది  ఉద్యోగాలు, ఉపాధి పొందుతున్నారని అన్నారు. రాబోయే పదేళ్ళలో మరో 4 లక్షల మందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పించేలా పెట్టుబడులు, పరిశ్రమలను ఆకర్షిస్తామని చెప్పారు. ప్రభుత్వ శాఖలలో మరో 1.32 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు. ఏ దేశంలోనైనా ప్రభుత్వోద్యోగాలు 5 శాతానికి మించవని తెలంగాణలో నాలుగు కోట్ల జనాభాకు 7-8 లక్షలకు మించవని మంత్రి కేటీఆర్‌ వివరించారు. 

తెలంగాణలో పారిశ్రామిక ప్రగతి అద్భుతంగా ఉందని రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులే చెపుతున్నాయి. కనుక ఈవిషయంలో ప్రభుత్వాన్ని వేలెత్తి చూపడానికే లేదు. అలాగే జనాభా ప్రాతిపదికన ప్రభుత్వోద్యోగాలు ఉంటాయనే మంత్రి కేటీఆర్‌ వాదనను తప్పు పట్టలేము. కానీ పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగాలు, ఉపాధి గురించి ఇంత సుదీర్గంగా మాట్లాడిన మంత్రి కేటీఆర్‌ 65 వేల ఉద్యోగాల భర్తీ గురించి మాట్లాడకపోవడం శోచనీయం. త్వరలో 50 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించింది ప్రభుత్వమే. తరువాత 50 వేలు కాదు...సుమారు 65 వేల ఖాళీలున్నాయని వాటన్నిటినీ భర్తీ చేస్తామని చెప్పింది ప్రభుత్వమే. కానీ ఇంతవరకు నోటిఫికేషన్లే విడుదల కాలేదు. కనీసం మంత్రి కేటీఆర్‌ ప్రసంగంలో కూడా ఆ ప్రస్తావనే లేదు! 

ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఏడాదిగా రాష్ట్రంలో నిరుద్యోగులు కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. కనుక మంత్రి కేటీఆర్‌ నిన్న శాసనసభలో తన ప్రసంగంలో నోటిఫికేషన్ల గురించి స్పష్టత ఇస్తే బాగుండేది. రాష్ట్రంలో అందరికీ ప్రభుత్వోద్యోగాలు కల్పించాలని ఎవరూ అడగడం లేదు. ప్రభుత్వం చెప్పిన ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేయమని అడుగుతున్నారు. కనుక ఇకనైనా ప్రభుత్వం 65 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తే ఆ ప్రక్రియ పూర్తవడానికి మరో ఏడాది పడుతుంది.


Related Post