హైదరాబాద్‌-ముంబై మద్య బుల్లెట్ రైలు

September 28, 2021


img

దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌ నగరాన్ని దేశ ఆర్ధిక రాజధాని ముంబైని కలుపుతూ బుల్లెట్ రైలు ఏర్పాటు చేయాలని నేషనల్‌ హైస్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ప్రతిపాదించింది. దీనికి సంబందించి సమగ్ర నివేదిక (డీపీఆర్) రూపొందించేందుకుగాను ఇప్పటికే టెండర్లు పిలిచామని, వాటితో నవంబర్‌ 5న ప్రీ బిడ్ సమావేశం నిర్వహించబోతున్నట్లు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అచల్ ఖేర్ తెలిపారు. నవంబర్‌ 18లోగా వాటిని టెండర్లు సమర్పించాలని కోరుతామని తెలిపారు. డీపీఆర్ చేతికి వచ్చిన తరువాత ఈ ప్రాజెక్టు వ్యయం, పనులు ఎప్పుడు ఎంతకాలంలో పూర్తవుతాయనే దానిపై పూర్తి స్పష్టత వస్తుందని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు సుమారు లక్ష కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నట్లు అచల్ ఖేర్ తెలిపారు. ఈ బుల్లెట్ రైలు ప్రాజెక్టును ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మిస్తామని తెలిపారు.

హైదరాబాద్‌-తాండూర్-వికారాబాద్-గుల్బర్గా-పూణె మీదుగా (నవీ)ముంబై వరకు ఈ బుల్లెట్ రైలు నిర్మించాలని నిర్ణయించినట్లు అచల్ ఖేర్ తెలిపారు. ఈ మార్గంలో అయితే హైదరాబాద్‌-ముంబై మద్య 649.76 కిమీ దూరం ఉంటుందని తెలిపారు. గంటకు సుమారు 350 కిమీ వేగంతో పరుగులిడే ఈ బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే హైదరాబాద్‌ నుంచి ముంబై నగరానికి కేవలం 3 గంటల కంటే తక్కువ సమయంలోనే చేరుకోవచ్చునని తెలిపారు.    

వికారాబాద్ జిల్లా గుండా ఈ బుల్లెట్ రైలు ప్రాజెక్టు నిర్మించాలని నిర్ణయించినందున ఆ జిల్లాలో భూసేకరణ చేపడితే స్థానిక ప్రజలపై ఆర్ధిక, సామాజిక ప్రభావం గురించి తెలుసుకొనేందుకు త్వరలోనే సర్వే ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. జిల్లాలోని తాండూరు, పెద్దేముల్‌, ధరూర్‌, వికారాబాద్‌, నవాబ్‌పేట్‌ మండలాలోని 40 గ్రామాలలో ఈ సర్వే చేపట్టబోతున్నట్లు తెలిపారు. 

ఇప్పటికే ముంబై-అహ్మదాబాద్ మద్య బుల్లెట్ రైలు ప్రాజెక్టు నిర్మాణ పనులు జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు పనులన్నీ 2028లోగా పూర్తి చేసి అదే ఏడాది ఆగస్ట్ 15వ తేదీన భారత్‌లో తొలి బుల్లెట్ రైలును అందుబాటులోకి తేవాలని కేంద్రప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది.


Related Post