అభివృద్ధికి తెలంగాణ కేరాఫ్ అడ్రస్: మంత్రి కేటీఆర్‌

September 28, 2021


img

రాష్ట్ర ఐ‌టి, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ సోమవారం శాసనసభలో రాష్ట్రంలో జరుగుతున్న ఐ‌టి, పారిశ్రామిక అభివృద్ధి గురించి సభ్యులకు వివరిస్తూ, “దేశంలో పారిశ్రామిక అభివృద్ధికి తెలంగాణ కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. ట్రాక్టర్ నుంచి హెలికాప్టర్‌ వరకు, ఎలక్ట్రిక్ బస్సు నుంచి ఎయిర్ బస్సు వరకు, టైల్స్ నుంచి టెక్స్‌టైల్‌ వరకు ఇలా... ప్రతీ పరిశ్రమకు తెలంగాణ గమ్యస్థానంగా మారింది. అలాగే సాగునీరు, వ్యవసాయం, విద్యుత్ తదితర రంగాలలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలుస్తోంది. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు, పరిశ్రమలు, ఐ‌టి కంపెనీలు తరలివస్తున్నాయి. వాటి ద్వారా లక్షల మంది ఉద్యోగాలు, ఉపాధి పొందుతున్నారు.      

ఫార్మా రంగంలో కూడా తెలంగాణ అగ్రస్థానంలోకి దూసుకుపోతోంది. 10,400 ఎకరాలలో ఏర్పాటవుతున్న మెగా ఫార్మా సిటీలో రూ.65 వేల కోట్ల పెట్టుబడులతో అనేక పరిశ్రమలు రాబోతున్నాయి. వాటి ద్వారా రాష్ట్రంలో సుమారు 5 లక్షల మందికి ఉద్యోగాలు, ఉపాధి లభిస్తుంది. రాబోయే పదేళ్ళలో రాష్ట్రానికి వంద బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా మరో 4 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది. దీనికి ప్రధాన కారణం సిఎం కేసీఆర్‌ సూచన మేరకు మా ప్రభుత్వం ప్రవేశపెట్టిన టీఎస్‌ఐపాస్ విధానమే. దీంతో ఆశించిన దానికంటే మంచి ఫలితాలు వస్తున్నాయి. ఇందుకు తాజా ఉదాహరణగా కైటెక్స్ కంపెనీ మన రాష్ట్రానికి వస్తుండటమే. ఆ కంపెనీని ఆకర్శించేందుకు అనేక రాష్ట్రాలు పోటీ పడ్డాయి కానీ చివరికి తెలంగాణకే అది దక్కింది. 

అయితే ప్రతిపక్షాలు మాత్రం ఈ అభివృద్ధిని చూడలేక నిత్యం మా ప్రభుత్వంపై బురద జల్లుతున్నాయి. కానీ ఆ ప్రయత్నంలో కూడా అవే రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవరిస్తున్నాయి. అందుకు నేను వాటికి కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను. 

కేంద్రప్రభుత్వం ఒక్కో ప్రభుత్వ రంగ సంస్థను అమ్మేసుకొంటుంటే తెలంగాణలో ఐ‌టి, పారిశ్రామిక అభివృద్ధి జోరుగా జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఈ అభివృద్ధిని కేంద్రప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నీతి ఆయోగ్ నివేదికలే దృవీకరిస్తున్నాయి,” అని తెలిపారు.


Related Post