ఉపఎన్నిక గంట మ్రోగింది...ఇక యుద్ధమే

September 28, 2021


img

హుజూరాబాద్‌ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. అక్టోబర్ 8వరకు నామినేషన్లకు గడువు ఇచ్చి 30వ తేదీన ఎన్నిక నిర్వహించబోతున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. కనుక ఇక నుంచి టిఆర్ఎస్‌-బిజెపిల మద్య జరుగుతున్న రాజకీయ యుద్ధం ఇంకా తీవ్రతరం కానుంది. 

ఇప్పటికే టిఆర్ఎస్‌ గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను అభ్యర్ధిగా ప్రకటించింది. బిజెపి ఇంకా అభ్యర్ధిని ప్రకటించనప్పటికీ ఈటల రాజేందర్‌ లేదా ఆయన సతీమణి జమున పోటీ చేయడం దాదాపు ఖాయమనే భావించవచ్చు. ఇక మిగిలింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. అయితే పరోక్షంగా సిఎం కేసీఆర్‌కు ప్రత్యక్షంగా ఈటల రాజేందర్‌కు మద్య జరుగుతున్న ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలవడం దాదాపు అసాధ్యమే అని చెప్పవచ్చు. కనీసం గౌరవప్రదమైన ఓట్లు గెలుచుకొంటే అదే పదివేలు అనుకోవచ్చు. ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ దక్కించుకోవాలని పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డికి టిఆర్ఎస్‌ నేతలు సవాళ్ళు విసురుతున్నారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. కనుక ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్ధిని బలిపశువుగా భావించవచ్చు. అందుకే పార్టీలో ఎవరూ ముందుకు రావడం లేదు. కానీ పిసిసి అధ్యక్షుడిగా రేవంత్‌ రెడ్డి పగ్గాలు చేపట్టిన తరువాత జరుగుతున్న తొలి ఎన్నిక ఇది గనుక కాంగ్రెస్ పార్టీ వెనక్కు తగ్గలేదు. ఈ నేపధ్యంలో పార్టీలో సీనియర్ నేత, బీసీ వర్గానికి చెందిన కొండా సురేఖను బరిలో దింపాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. అక్టోబర్ 8లోగా నామినేషన్లు వేయాల్సి ఉంటుంది కనుక ఆలోగా కాంగ్రెస్‌ అభ్యర్ధిగా ఆమె బరిలో దిగుతారా లేదా అనేది తేలిపోతుంది. ఇప్పటికే మంత్రి హరీష్‌రావు, ఈటల రాజేందర్‌ మద్య హుజూరాబాద్‌లో పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఒకవేళ కొండా సురేఖ కూడా బరిలో దిగితే ఆ తరువాత మూడు పార్టీల మద్య అసలు యుద్ధం మొదలవుతుంది.


Related Post