జగ్గారెడ్డి చల్లబడ్డారు...ఎందుకో?

September 25, 2021


img

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి నిన్న పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిపై మీడియా ఎదుట తీవ్ర విమర్శలు చేశారు. “పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి పార్టీలో అందరినీ తొక్కేస్తూ తానొక్కడే హీరో అన్నట్లు వన్ మ్యాన్ షోలా పార్టీని నడిపిస్తున్నాడని, పార్టీలో ఎవరినీ సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకొంటున్నారని,” జగ్గారెడ్డి నిన్న ఆరోపించారు. కానీ 24 గంటల వ్యవధిలో చల్లబడిపోయి, ఆవిదంగా మాట్లాడటం తప్పేనని, రేవంత్‌ రెడ్డిని నొప్పించినందుకు క్షమించాలని పార్టీ పెద్దలను కోరారు. రేవంత్‌ రెడ్డి తాను అన్నదమ్ములవంటివారమని కనుక తన మాటలను మనసులో పెట్టుకోవద్దని జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇక నుంచి పార్టీ వ్యవహారాల గురించి బహిరంగంగా మీడియాతో మాట్లాడనని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణికం ఠాకూర్‌కు హామీ ఇచ్చారు. 

జగ్గారెడ్డి చేసిన తీవ్ర వ్యాఖ్యలపై పార్టీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేయడంతో శనివారం సాయంత్రం గాంధీభవన్‌లో రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణికం ఠాకూర్‌ అధ్యక్షతన కాంగ్రెస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్లు, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాసన్ కృష్ణన్ తదితరులు సమావేశమయ్యి, జగ్గారెడ్డిని పిలిపించుకొని మందలించారు. దీంతో జగ్గారెడ్డి చల్లబడ్డారు.

అనంతరం పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్ కుమార్‌ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ, “సమాచార లోపం కారణంగా ఈ వివాదం ఏర్పడింది. కానీ జగ్గారెడ్డి పార్టీ పెద్దలకి వివరణ ఇవ్వడంతో ఈ వివాదం ఇంతటితో ముగిసింది,” అని అన్నారు. 

అయితే జగ్గారెడ్డి ప్రస్తుతానికి కాస్త వెనక్కు తగ్గి రేవంత్‌ రెడ్డికి పార్టీకి క్షమాపణ చెప్పినప్పటికీ రేవంత్‌ రెడ్డి పట్ల ఆయన అభిప్రాయం మారిపోతుందనుకోలేము. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ వ్యవహారంలో కాంగ్రెస్‌ అధిష్టానం రేవంత్‌ రెడ్డికి అండగా నిలబడి, పార్టీలో ఆయనను ఎవరు వ్యతిరేకించినా ఉపేక్షించేది లేదని స్పష్టమైన సంకేతం ఇచ్చిందనే చెప్పాలి. ఇది పార్టీలో రేవంత్‌ రెడ్డి వర్గానికి చాలా సంతోషం కలిగించవచ్చు. కానీ ఆయన పార్టీలో అందరినీ కలుపుకుపోకుండా మళ్ళీ ‘వన్ మ్యాన్ షో’ చేస్తే భవిష్యత్‌లో మళ్ళీ మళ్ళీ ఇటువంటి విమర్శలే ఎదుర్కోవలసి వస్తుందని మరిచిపోకూడదు.


Related Post