హుజూరాబాద్ ఉపఎన్నిక గంట ఇంకా మ్రోగకపోయినప్పటికీ, ఒకటి రెండు నెలల్లో ఎన్నిక జరగడం ఖాయం. కనుకనే ఈ ఉపఎన్నికలో ప్రధానంగా పోటీ పడుతున్న టిఆర్ఎస్, బిజెపిలు హోరాహోరీగా ఎన్నికల ప్రచారం చేస్తున్నాయి. ఇంతవరకు బాగానే ఉంది. అయితే సరిగ్గా ఈ సమయంలో సిఎం కేసీఆర్ రెండుసార్లు ఢిల్లీ పర్యటనలు చేయడం రాష్ట్ర బిజెపి నేతలకు జీర్ణించుకోవడం కష్టంగానే ఉందని చెప్పవచ్చు. రాష్ట్రంలో సిఎం కేసీఆర్...టిఆర్ఎస్ ప్రభుత్వంతో నిత్యం యుద్ధం చేస్తూ హుజూరాబాద్ ఉపఎన్నికలో గెలిచేందుకు సర్వశక్తులు ఒడ్డుతుంటే, సిఎం కేసీఆర్ ‘రాష్ట్రానికి చెందిన సమస్యల పరిష్కారం కోసం...’అనే సాకుతో ఢిల్లీ వెళ్ళి తమ పెద్దలతో భేటీ అవుతున్నారు. తద్వారా రాష్ట్ర స్థాయిలో టిఆర్ఎస్, బిజెపిలు కత్తులు దూసుకొంటున్నప్పటికీ, తమ మద్య మంచి అండర్‌స్టాండింగ్ ఉందనే తప్పుడు సంకేతాలు పంపిస్తూ ప్రజలలో, బిజెపి కార్యకర్తలలో కూడా ఓ రకమైన అయోమయం లేదా గందరగోళం సృష్టిస్తున్నారని బిజెపి నేతలు వాపోతున్నారు.
టిఆర్ఎస్, బిజెపిలు రెంటి మద్య అవగాహన ఉందని ప్రజలు కూడా నమ్మితే నష్టపోయేది బిజెపియే. ముఖ్యంగా ఈ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకొని కష్టపడుతున్న ఈటల రాజేందర్ తీవ్రంగా నష్టపోతారు. అయితే ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రమంత్రులు సిఎం కేసీఆర్‌ను కలవకుండా రాష్ట్ర బిజెపి నేతలు ఆపలేరు. కనుక సిఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్ళి కేంద్రమంత్రులతో భేటీ అయినప్పుడల్లా రాష్ట్ర బిజెపి నేతలు దాని గురించి ప్రజలకు సంజాయిషీ ఇచ్చుకోవలసి వస్తోంది.
ఇంకా గమ్మతైన విషయం ఏమిటంటే, రాజకీయ నాయకులు తమ ప్రత్యర్ధులను ప్రత్యక్షంగా ఢీకొనో లేదా వెన్నుపోటు పొడిచో పైచేయి సాధిస్తుంటారు కానీ సిఎం కేసీఆర్ కేంద్రమంత్రులతో దోస్తీతో రాష్ట్ర బిజెపిని చంపేస్తున్నారు. అందుకే రాష్ట్ర బిజెపి నేతలు కక్కలేక...మింగలేక అన్నట్లు బాధపడుతున్నారు.