ప్రధాని నరేంద్రమోడీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ల సమావేశంలో ఆఫ్ఘనిస్తాన్‌లో పరిస్థితులపై చర్చించినప్పుడు, ఆ దేశాన్ని ఉగ్రవాదులకు, ఉగ్రవాద శిక్షణకు అడ్డాగా మారకుండా చూడాలని వారు తాలిబన్లకు పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్‌లో ఇతర దేశాలకు ముప్పు కలిగించే ఉగ్రవాదులను నిర్మూలించాలని వారు పిలుపునిచ్చారు.
కరడుగట్టిన నరహంతకులైన తాలిబన్లే ఉగ్రవాదులు. ఇప్పుడు ఆ ఉగ్రవాదులనే ఆఫ్ఘనిస్తాన్‌లో ఉగ్రవాదాన్ని నిర్మూలించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కోరడం చాలా హాస్యాస్పదంగా ఉంది. భారత్, అమెరికా భయాలు ఆ దేశంలో ఉగ్రవాదులు అధికారంలోకి వచ్చారని కాదు. తాలిబన్లు తమ దేశాలలో ఎక్కడ విధ్వంసం సృష్టిస్తారో అని ఆందోళన చెందుతున్నాయి.
ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని అమెరికా చేజేతులా తాలిబన్లకు అప్పగించేసి ఆ దేశంలో మళ్ళీ ఉగ్రవాదులు బలపడేందుకు అవకాశం కల్పించింది. నిజానికి అమెరికాకు ఈ ఆలోచన ముందే ఉంటే తాలిబన్లకు ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని అప్పగించేదే కాదు. కనుక ఇప్పుడు వారికి సుద్దులు చెప్పడం చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకోవడమే అని భావించవచ్చు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా సేనల ఉపసంహరణతో అమెరికా ప్రతిష్ట మసకబారింది. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తాలిబన్లను ఈవిదంగా వేడుకొంటూ ఇంకా నవ్వులపాలవుతున్నారు.