కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఉద్దేశ్యించి మీడియా ఎదుట చేసిన తీవ్ర వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిష్టానం వెంటనే స్పందించింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-ఛార్జ్ మానిక్కం ఠాగూర్‌ను శనివారం హైదరాబాద్‌కు పంపిస్తోంది. ఆయన గాంధీభవన్‌లో పార్టీ సీనియర్ నేతలతో సమావేశమై జగ్గారెడ్డి వ్యాఖ్యలపై చర్చించనున్నారు. తరువాత జగ్గారెడ్డిని కూడా సంజాయిషీ కోరనున్నారు. ఒకవేళ జగ్గారెడ్డి సంజాయిషీ సంతృప్తికరంగా లేనట్లయితే క్రమశిక్షణ చర్యలు తీసుకొనే అవకాశం ఉంది.
జగ్గారెడ్డి నిన్న శాసనసభ వద్ద మీడియాతో మాట్లాడుతూ, “పార్టీలో రేవంత్ రెడ్డి ఒక్కడే స్టార్ హీరో అన్నట్లు వ్యవహరిస్తూ మిగిలినవారిని తొక్కేయాలని చూస్తున్నాడు. పార్టీలో ఎవరినీ సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. రేవంత్ రెడ్డి తీరు మార్చుకొంటే మంచిది...” అంటూ చాలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో వాక్ స్వాతంత్ర్యం చాలా ఎక్కువ గనుక తరచూ ఇటువంటి మాటలు వినపడుతుంటాయి. కనుక పార్టీకి నష్టం కలిగించేవారిపై చర్యలు తీసుకోవడం సమంజసమే. అయితే పార్టీలో ఆలోచించడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి ఇంతకంటే చాలా ముఖ్యమైన విషయాలు చాలానే ఉన్నాయి. త్వరలో హుజూరాబాద్ ఉపఎన్నిక జరుగబోతోంది. టిఆర్ఎస్, బిజెపిలు అభ్యర్ధులు నియోజకవర్గంలో పర్యటిస్తూ ఉదృతంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు అభ్యర్ధినే ఖరారు చేయలేదు. హుజూరాబాద్‌లో కాంగ్రెస్ డిపాజిట్ తెచ్చుకోవాలని టిఆర్ఎస్ సవాళ్ళు విసురుతుంటే కాంగ్రెస్ నేతలు స్పందించడం లేదు. అంటే హుజూరాబాద్ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ ఓటమిని అంగీకరించిందనుకోవలసి ఉంటుంది.
రాష్ట్రంలో టిఆర్ఎస్‌కు మేమే ప్రత్యామ్నాయమని పదేపదే చెప్పుకొంటూ హుజూరాబాద్ ఉపఎన్నికకు కాంగ్రెస్ పార్టీ వెనకాడటాన్ని ఏమనుకోవాలి? ఒక్క హుజూరాబాద్‌లోనే గెలవలేనప్పుడు రాష్ట్రవ్యాప్తంగా జరిగే శాసనసభ ఎన్నికలలో ఎలా గెలవగలదు?అని కాంగ్రెస్ పెద్దలు ఆలోచిస్తే బాగుంటుంది. జగ్గారెడ్డి వ్యవహారంపై హడావుడి చేయడం వలన పార్టీకి ఏమి ప్రయోజనం?