తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యవహార శైలిపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి మీడియా సమావేశంలో బహిరంగంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
శుక్రవారం కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశానికి ముందు మీడియా పాయింట్ వద్ద జగ్గారెడ్డి మాట్లాడుతూ, “రేవంత్ రెడ్డి పార్టీలో తానొక్కడే స్టార్ హీరో అనుకొంటున్నాడా?ఆయన తన ఇమేజ్ పెంచుకోవడం కోసం అందరినీ తొక్కేస్తున్నాడు. పార్టీ కార్యక్రమాల గురించి ముందుగా అందరితో చర్చించకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొంటున్నాడు. నా జిల్లాలో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తే ఆ విషయం ముందుగా నాకు తెలియజేయవలసిన అవసరం లేదా? ఇప్పటికే నాకు, ఆయనకి విబేధాలున్నాయని, ఇద్దరికీ పొసగడం లేదని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి ప్రోటోకాల్ పాటించకుండా జిల్లాలో పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటూ ఆ ఊహాగానాలు నిజమనిపించేలా చేస్తున్నారు. గజ్వేల్ సభలో నాకు మాట్లాడే అవకాశం ఎందుకు ఇవ్వలేదు?
నేను మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. కానీ నన్ను పట్టించుకోకుండా ఆయనొక్కడే హీరో అన్నట్లు రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు. ఈ పద్దతి మార్చుకొంటే మంచిది. పార్టీలో ఒకరినెత్తిన మరొకరు చెయ్యి పెట్టుకొంటుంటే రాష్ట్రంలో పార్టీ ఏవిదంగా అధికారంలో తీసుకురాగలరు?పార్టీలో సీనియర్ నాయకుడినైనా నాకు గౌరవం ఇవ్వకపోవడం చాలా దురదృష్టం. నేను పార్టీ వీడి వెళ్లిపోతే నన్ను అడ్డుకొనేదెవరు?
పార్టీ సభలు, సమావేశాలలో నన్ను మాట్లాడనీయకపోవడం వలననే నేను ఈవిదంగా మీడియా ముందుకు వచ్చి నోరు విప్పవలసి వస్తోంది,” అని అన్నారు.
పార్టీలో చాలా మంది సీనియర్లు రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బహిరంగంగానే వ్యతిరేకించారు. కానీ ఆ తరువాత పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి మౌనం వహించారు. వారు వెనక్కు తగ్గినప్పుడు రేవంత్ రెడ్డి వారందరినీ కలుపుకుపోయే ప్రయత్నం చేసి ఉండాలి. కానీ పార్టీలో తనకు అనుకూలంగా ఉన్న కొద్దిమంది నాయకులతో చర్చించి సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. అందుకే రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్న సభలలో సీనియర్లు కనబడటం లేదు.
జగ్గారెడ్డి చెప్పినట్లు ఏ ఒక్కరి వల్లనో కాంగ్రెస్ పార్టీ బలపడలేదు. ఎవరి సహాయసహకారాలు లేకుండా టిఆర్ఎస్, బిజెపిలను రేవంత్ రెడ్డి ఒక్కరే ఎదుర్కోలేరు. కనుక పార్టీలో అందరినీ కలుపుకుపోక తప్పదు లేకుంటే చివరికి పార్టీలో ఆయన ఒంటరిగా మిగిలిపోయే ప్రమాదం ఉంటుంది.