దేశంలో నానాటికీ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలతో సామాన్యులు అల్లాడుతుంటే, కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం నిందించుకొంటూ కాలక్షేపం చేస్తుండటం చాలా బాధాకరం. ఇటీవల జరిగిన జీఎస్‌టీ 45వ కౌన్సిల్ సమావేశంలో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్‌ను జీఎస్‌టీ తీసుకువస్తాయని, దాంతో వాటి ధరలు సగానికి సగం తగ్గే అవకాశం ఉందంటూ మీడియాలో ఊహాగానాలు వచ్చాయి. కానీ అందుకు రాష్ట్రాలే ఒప్పుకోలేదని కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పురి తెలిపారు.
కోల్‌కతాలో ఉపఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, “పెట్రోల్, డీజిల్‌పై వచ్చే పన్ను రాబడి రాష్ట్రాలకు ప్రధాన ఆదాయవనరులలో ఒకటి కనుక దానిని వదులుకొనేందుకు రాష్ట్రాలు ఇష్టపడటం లేదని అందుకే ఆ రెంటినీ జీఎస్‌టీ పరిధిలోకి తీసుకు రాలేకపోయాము. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర 19 డాలర్లు ఉన్నప్పుడు, ఇప్పుడూ 75 డాలర్లకు చేరినప్పుడు కూడా కేంద్రప్రభుత్వం లీటరు పెట్రోల్‌పై రూ.32 మాత్రమే పన్ను వసూలు చేస్తోంది. అంటే కేంద్రప్రభుత్వానికి పెట్రోల్‌పై వచ్చే ఆదాయం గణనీయంగా తగ్గిపోయిందన్న మాట! పన్ను ద్వారా వచ్చే ఆ సొమ్ముతో దేశంలో పేద ప్రజలకు ఉచిత రేషన్ బియ్యం, ఉచిత గృహాలు, పలు సంక్షేమ పధకాలకు ఖర్చు చేస్తున్నాము,” అని చెప్పారు.
అయితే హుజూరాబాద్‌లో ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీష్‌రావు, “పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెంచుతున్నందుకా...బిజెపికి ఓటు వేయాలి?బిజెపికి ఓటు వేస్తే వంట గ్యాస్ ధర రూ.1,000కి పెంచేస్తుంది,” అంటూ ధరల పెరుగుదలలో కేంద్రానిదే పూర్తి బాధ్యత అన్నట్లు వాదిస్తున్నారు. అంటే కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు రెండూ పరస్పరం నిందించుకొంటూ ప్రజలను మభ్య పెడుతున్నాయని స్పష్టం అవుతోంది.