హుజూరాబాద్ ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుదలకాలేదు కానీ రెండు నెలలుగా టిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ నేతలు పరస్పర విమర్శలు, ఆరోపణలు చేసుకొంటూనే ఉన్నారు. చెన్నూర్ టిఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఉద్దేశ్యించి, “హుజూరాబాద్‌లో కాంగ్రెస్ ఓటమి ఖాయమని గ్రహించినందునే ఇంతవరకు హుజూరాబాద్ ఉపఎన్నిక ఊసే ఎత్తడం లేదు. సిఎం కేసీఆర్‌పై నోరు పారేసుకోవడం కాదు దమ్ముంటే హుజూరాబాద్ ఉపఎన్నికలో మీ పార్టీకి డిపాజిట్ దక్కించుకొని చూపించు,” అని సవాల్ విసిరారు.
రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత జరుగుతున్న తొలి ఎన్నిక ఇది. కనుక రేవంత్ రెడ్డి ఈ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకొని కాంగ్రెస్ గెలుపు కోసం గట్టిగా కృషి చేస్తారని భావిస్తే, అసలు ఆ ఊసే ఎత్తడం లేదు. కొన్ని రోజుల క్రితం కొండా సురేఖను హుజూరాబాద్ బరిలో దింపడానికి గాంధీభవన్‌లో సమావేశం నిర్వహించారు కానీ ఉపఎన్నిక ఆలస్యం అవడంతో ఇంతవరకు పార్టీ అభ్యర్ధిని ఖరారు చేయలేదు. వివిద జిల్లాలో రేవంత్ రెడ్డి దండోరా సభలు నిర్వహిస్తున్నారు కానీ హుజూరాబాద్‌వైపు తొంగి చూడటం లేదు. అంటే ఈ ఉపఎన్నిక పట్ల ఆసక్తి చూపడం లేదని స్పష్టం అవుతోంది. ఈ ఉపఎన్నికలో టిఆర్ఎస్, బిజెపిల మద్య చాలా తీవ్రమైన పోటీ నెలకొని ఉంది కనుక అక్కడ కాంగ్రెస్ ఓటమి తప్పదని భావిస్తున్నందునే రేవంత్ రెడ్డితో సహా కాంగ్రెస్ నేతలు ఎవరూ హుజూరాబాద్ ఉపఎన్నిక ప్రస్తావన చేయడంలేదని భావించవచ్చు.