పాక్‌ ఉగ్రవాదాన్ని దాచుకోగలదా?

September 22, 2021


img

ప్రపంచంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దేశాల పేర్లు చెప్పుకోవలసివస్తే మొట్టమొదట పాకిస్థాన్‌ పేరు చెప్పుకోవలసి ఉంటుంది. భారత్‌పై తీవ్ర ద్వేషం, అక్కసుతో పాక్‌ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులతో ఇప్పుడు భారత్‌ కంటే ఆ దేశానికే ఎక్కువ నష్టం జరుగుతోంది. 

పాక్‌లో జరుగవలసిన క్రికెట్ సిరీస్‌లో పాల్గొనవలసిన న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్టులు చివరి నిమిషంలో భద్రతా కారణాల చేత తమ పర్యటనను రద్దు చేసుకొంటున్నట్లు ప్రకటించాయి. వారికి పూర్తి రక్షణ కల్పిస్తామని పాక్‌ ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ వారు పాక్‌లో ఆడేందుకు ఇష్టపడలేదు. దీంతో పాక్‌ క్రికెటర్లు, క్రికెట్ అభిమానులు, తీవ్ర నిరాశ చెందారు. ప్రభుత్వం కూడా తీవ్ర నిరాశ చెందింది. 

అయితే విదేశీ జట్లు భద్రతా కారణాల చేత తమ పర్యటనలను రద్దు చేసుకోలేదని, అమెరికా ఒత్తిళ్ళ కారణంగానే ఈ నిర్ణయం తీసుకొన్నాయని పాక్‌ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, పాక్‌ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ఇదివరకు ఆఫ్ఘనిస్తాన్‌లో మిలటరీ ఆపరేషన్ల కోసం పాక్‌ భూభాగం వినియోగించుకొనేందుకు అనుమతించాల్సిందిగా అమెరికా కోరినప్పుడు తాను నిర్ద్వందంగా తిరస్కరించానని, అది మనసులో పెట్టుకొనే అమెరికా ఇప్పుడు పాక్‌లో క్రికెట్ పోటీలకు మోకాలు అడ్డుతోందని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. అయితే దేశం (పాక్‌) తలెత్తుకొని నిలబడాలంటే ఈ మాత్రం మూల్యం చెల్లించక తప్పదని అన్నారు. 

తమ దేశంలో ఎటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయో, విదేశీ జట్లు తమ దేశంలో ఆడేందుకు ఎందుకు భయపడుతున్నాయో ఇమ్రాన్ ఖాన్‌కు కూడా బాగా తెలుసు. ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకొంటే మొట్టమొదట వారికి మద్దతు పలికింది పాక్‌ ప్రభుత్వమే. కరడుగట్టిన తాలిబన్ ఉగ్రవాదులు రాజ్యాధికారం దక్కించుకోవడానికి, పంజషేర్ ప్రావిన్స్‌లో తాలిబన్లను ఎదిరించి పోరాడినవారిని మట్టుపెట్టడంలో సాయపడింది పాక్‌ ప్రభుత్వం, సైన్యాధికారులే. తాలిబన్లతో స్నేహం కోసం పరితపిస్తున్న పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు తప్ప వేరెవరు మాత్రం ప్రాణాలకు తెగించి ఆటలాడగలరు?


Related Post