తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్, కేంద్రంలో బిజెపి ఒకేసారి అధికారంలోకి వచ్చాయి. రెండు పార్టీలు రెండోసారి కూడా ఎన్నికలలో విజయం సాధించి అధికారం నిలుపుకొన్నాయి. 2023-24లో జరుగబోయే ఎన్నికలలో కూడా మళ్ళీ తామే గెలిచి అధికారంలోకి వస్తామని రెండు పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే అది అంత సులువు కాదని వాటికీ తెలుసు.
పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలలో గెలిచేందుకు బిజెపి సర్వశక్తులు ఒడ్డి పోరాడినా గెలవలేకపోయింది. హుజూరాబాద్ ఉపఎన్నిక టిఆర్ఎస్‌కు చాలా చిన్నదని చెపుతూనే, ఆ ఎన్నికలో గెలిచేందుకు ప్రభుత్వం, పార్టీ చేస్తున్న ప్రయత్నాలను అందరూ చూస్తూనే ఉన్నారు. కనుక రాష్ట్రవ్యాప్తంగా జరిగే శాసనసభ ఎన్నికలు, దేశవ్యాప్తంగా జరిగే లోక్‌సభ ఎన్నికలలో గెలవడం ఎంత కష్టమో ఊహించుకోవచ్చు.
వచ్చే సార్వత్రిక ఎన్నికలలో రెండు పార్టీలకు కొన్ని సానుకూలతలు, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి.
సానుకూలతలేమిటంటే, జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ప్రతిపక్ష పార్టీలు బలహీనంగా ఉండటం. బిజెపి, టిఆర్ఎస్ పార్టీలకు బలమైన ప్రత్యామ్నాయం లేనందున ప్రజలు మళ్ళీ వాటినే ఎన్నుకొనే అవకాశాలు ఎక్కువ. అక్కడ ప్రధాని నరేంద్రమోడీ, ఇక్కడ సిఎం కేసీఆర్ ఇద్దరూ బలమైన నాయకులుగా గుర్తింపు పొందారు. కనుక అంత బలమైన, ప్రజాకర్షణ కలిగిన నాయకుడు ప్రతిపక్షాలకు లేకపోవడం అధికార పార్టీలకు సానుకూలతగానే చూడవచ్చు.
దేశానికి చైనా, పాకిస్థాన్, తాలిబన్ల నుంచి పొంచి ఉన్న ముప్పు కారణంగా ప్రజలు మోడీ వంటి బలమైన నాయకుడినే కోరుకొంటారు. మోడీ హయాంలో దేశం వరుసగా అనేక సంక్షోభాలను ఎదుర్కొన్నప్పటికీ మౌలికవసతుల కల్పన, అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతుండటం సానుకూల అంశమే.
అలాగే అస్తవ్యస్తంగా చేతికి అందిన తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా చక్కబెట్టి, అభివృద్ధి పధంలో నడిపిస్తున్న కారణంగా ప్రజలు మళ్ళీ సిఎం కేసీఆర్ నాయకత్వన్నే కోరుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ, సంక్షేమ పధకాలు అమలు చేస్తూ, రాష్ట్రంలో రాజకీయ సుస్థిరత నెలకొల్పడం ద్వారా రాష్ట్రానికి భారీ పెట్టుబడులు, పరిశ్రమలను రప్పిస్తున్నారు. ప్రజలకు కావలసింది అదే. కనుక సిఎం కేసీఆర్ ప్రతిపక్షాలతో ఏవిదంగా వ్యవహరిస్తున్నారనేది ప్రజలు పట్టించుకోకపోవచ్చు.
ప్రతికూలాంశాలను పరిశీలిస్తే, సుదీర్గ పాలనలో ప్రభుత్వం పట్ల ప్రజలలో సహజంగానే వ్యతిరేకత ఏర్పడుతుంది. అప్పుడు ప్రజలు మార్పు కోసం ప్రత్యామ్నాయ పార్టీల వైపు చూస్తారు. ప్రభుత్వ వైఫల్యాలు, హామీల అమలులో వైఫల్యాలపై ప్రతిపక్షాల విమర్శలు ప్రజలను ఆలోచింపజేస్తాయి. అధికార పార్టీ చేతిలో తాము మోసపోయామనే భావన ఏర్పడుతుంది. అటువంటి సమయంలో ప్రజలను ఏమాత్రం ఆకర్షించగలిగిన నాయకుడు ముందుకు వచ్చినా ఆ పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపుతారు.
2014 లోక్‌సభ ఎన్నికలలో రాహుల్ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీని, 2019లో జరిగిన ఏపీ శాసనసభ ఎన్నికలలో చంద్రబాబునాయుడును పక్కనపెట్టి జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలు ఎన్నుకోవడం గమనించినట్లయితే ఈవిషయం అర్దమవుతుంది.
ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్‌ల ప్రభుత్వాల వైఫల్యాలు, విధానపరమైన తప్పులు, లోపాల వంటివి వచ్చే ఎన్నికలలో వారి పార్టీలపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. కనుక వచ్చే సార్వత్రిక ఎన్నికలు బిజెపి, టిఆర్ఎస్‌లకు ఇదివరకులా పూలనావ కాబోదు. ప్రధాని నరేంద్రమోడీ, సిఎం కేసీఆర్ ఇద్దరూ తమ పార్టీల గెలుపు కోసం మరింత చమటోడ్చక తప్పదు.