కాంగ్రెస్‌, బిజెపిల సభలతో ఒత్తిడిలో టిఆర్ఎస్‌?

September 18, 2021


img

సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్‌, బిజెపిలు నిన్న భారీ బహిరంగసభలు నిర్వహించాయి. కాంగ్రెస్ పార్టీ గజ్వేల్లో దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా పేరుతో సభ నిర్వహించగా, బిజెపి నిర్మల్ జిల్లాలో తెలంగాణ విమోచన దినోత్సవ సభ నిర్వహించింది. రెండు సభలకు భారీగా జనం హాజరయ్యారు. రెండు పార్టీల తరపున జాతీయ నాయకులు, రాష్ట్ర స్థాయి నేతలు సభలకు హాజరయ్యి సిఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌, టిఆర్ఎస్‌ ప్రభుత్వం లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేశారు. 

ఒకే రోజున రెండు జాతీయ పార్టీలు రాష్ట్రంలో సభలు నిర్వహించడం యాదృచ్చికమే కావచ్చు కానీ రెండింటి లక్ష్యం ఒక్కటే. టిఆర్ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతి గురించి గట్టిగా ప్రస్తావించి ప్రజలకు చేరువవడం! రాష్ట్రంలో తమతమ పార్టీలను బలోపేతం చేసుకొని వచ్చే శాసనసభ ఎన్నికలలో టిఆర్ఎస్‌ పార్టీని ఓడించి అధికారంలోకి రావడం. ఇదే తమ లక్ష్యమని నిన్న జరిగిన సభలలో కాంగ్రెస్‌, బిజెపి నేతలు స్పష్టం చేశారు. ఈ ప్రయత్నాలలో అవి ఎంతవరకు సఫలం అవుతాయనేది పక్కన పెడితే, ఈ సభలతో టిఆర్ఎస్‌ ప్రభుత్వం, పార్టీ ప్రతిష్టకు భంగం కలుగుతుందని చెప్పవచ్చు. కనుక అది కూడా నేడో రేపో వాటిపై ఎదురుదాడి చేయవచ్చు. 

అయితే మూడు ప్రధాన పార్టీల మద్య యుద్ధం ఇప్పట్లో ముగిసేదికాదని అందరికీ తెలుసు. తెలంగాణలో మరో 20 ఏళ్ళు తామే అధికారంలో ఉండాలని, ఉంటామని టిఆర్ఎస్‌ చెపుతోంది. కానీ వచ్చే ఎన్నికలలోనే టిఆర్ఎస్‌ను ఓడించి రాష్ట్రంలో అధికారంలో వస్తామని కాంగ్రెస్‌, బిజెపిలు గట్టిగా వాదిస్తున్నాయి. ఆ దిశలో ఆ రెండు పార్టీలు గట్టి ప్రయత్నాలు కూడా చేస్తున్నాయి. బండి సంజయ్‌, రేవంత్‌ రెడ్డి నియమకాలు అటువంటివే. కనుక వచ్చే శాసనసభ ఎన్నికల వరకు ఈ మూడు పార్టీల మద్య ఇదేవిదంగా రాజకీయ యుద్ధాలు అనివార్యమే. అప్పటిలోగా రాష్ట్రంలో కాంగ్రెస్‌, బిజెపిలు పుంజుకోగలవా లేదా? టిఆర్ఎస్‌ వాటి ఎదుగుదలను అడ్డుకోగలదా లేదా? అనేది చూడాలి.


Related Post