మజ్లీస్‌కు టిఆర్ఎస్‌ భయపడుతోందా?

September 17, 2021


img

ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా బిజెపి అధ్వర్యంలో నిర్మల్లో సభ జరిగింది. ఆ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగిస్తూ, టిఆర్ఎస్‌ ప్రభుత్వం మజ్లీస్‌కు భయపడుతూ దాని కనుసన్నలలో పనిచేస్తోందని, అందుకే అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం జరుపడం లేదన్నారు. టిఆర్ఎస్‌, మజ్లీస్‌ పార్టీల నుంచి విముక్తి లభించినప్పుడే తెలంగాణకు నిజమైన స్వాతంత్ర్యం లభించినట్లని అన్నారు. కేసీఆర్‌ కుటుంబపాలన నుంచి తెలంగాణకు బిజెపి మాత్రమే విముక్తి కల్పించి, ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడగలదని అన్నారు. వచ్చే శాసనసభ ఎన్నికలలో తెలంగాణలో బిజెపి తప్పకుండా గెలిచి అధికారంలోకి వస్తుందని, లోక్‌సభ ఎన్నికలలో తెలంగాణలోని అన్ని సీట్లు బిజెపి గెలుచుకొంటుందని నమ్మకం తనకుందని అమిత్ షా అన్నారు. 

మజ్లీస్‌కు టిఆర్ఎస్‌ భయపడుతోందనే అమిత్ షా వాదనలో నిజమెంత?అని ఆలోచిస్తే పూర్తిగా నిజమూ కాదు అబద్దమని కొట్టిపారేయలేమని చెప్పవచ్చు. 

మజ్లీస్‌ పార్టీతో సఖ్యతగా ఉండటం వలన టిఆర్ఎస్‌కు కొన్ని లాభాలున్నాయి. ఇతర రాష్ట్రాలలో పోటీ చేస్తున్న మజ్లీస్‌ పార్టీ తెలంగాణలో మాత్రం హైదరాబాద్‌కే పరిమితమయుంటోంది. ఒకవేళ రాష్ట్రంలో ముస్లింలు ఎక్కువగా ఉన్న జిల్లాలలో, ప్రాంతాలలో మజ్లీస్‌ పోటీ చేస్తే నష్టపోయేది టిఆర్ఎస్‌ పార్టీయే! 

హైదరాబాద్‌ నగరంలో ప్రశాంతంగా ఉండేందుకు మజ్లీస్‌తో దోస్తీ చాలా అవసరమే. జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో బిజెపి ఎంతగా రెచ్చగొట్టినప్పటికీ మజ్లీస్‌ పార్టీ సంయమనం కోల్పోకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు తోడ్పడటమే ఇందుకు ఓ తాజా ఉదాహరణగా భావించవచ్చు. 

ఇటువంటి రాజకీయ అవసరాలు, ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొనే టిఆర్ఎస్‌ ప్రభుత్వం మజ్లీస్‌తో సఖ్యతగా ఉంటోందని చెప్పవచ్చు. అయితే మజ్లీస్‌ దోస్తీ టిఆర్ఎస్‌కు చాలా అవసరం కనుక దానికి ఆగ్రహం కలిగించే నిర్ణయాలు, పనులు చేయ(లే)దు. దానికి బిజెపి ‘భయం’ అని పేరు పెట్టుకొన్నా ‘దోస్తీ’ అని పేరు పెట్టుకొన్నా టిఆర్ఎస్‌, మజ్లీస్‌లు స్పందించవు...అసలు పట్టించుకోవు. కనుకనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా మొదలు బండి సంజయ్‌ వరకు బిజెపి నేతలు పదేపదే టిఆర్ఎస్‌-మజ్లీస్‌లను జోడించి విమర్శలు చేస్తుంటారనుకోవచ్చు. 



Related Post