తెలంగాణలో బిజెపి ఎన్నటికీ అధికారంలోకి రాలేదు

September 17, 2021


img

హుజూరాబాద్‌ ఉపఎన్నికలో నూటికి నూరు శాతం టిఆర్ఎస్‌ గెలుపు ఖాయమని పదేపదే చెపుతున్న మంత్రి హరీష్‌రావు ఒకవేళ ఈటల రాజేందర్‌ గెలిస్తే... అంటూ మాట్లాడటం విశేషం.

మంత్రి హరీష్‌రావు గురువారం హుజూరాబాద్‌లో విశ్వకర్మ సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతారం మీడియాతో మాట్లాడుతూ, “ఒకవేళ హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌ గెలిస్తే బిజెపికి మరో ఎమ్మెల్యే సీటు దక్కుతుంది తప్ప రాష్ట్రంలో ఎన్నటికీ అధికారంలోకి రాలేదు. హుజూరాబాద్‌లో ఈటల గెలిస్తే దాని వలన ఆయనే లాభపడతారు తప్ప నియోజకవర్గానికి, హుజూరాబాద్‌ ప్రజలకు ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఈటల రాజేందర్‌ 17 ఏళ్ళుగా హుజూరాబాద్‌కి ప్రాతినిధ్యం వహించినా నియోజకవర్గానికి ఏమీ చేయలేదు. కనుక ఈసారి టిఆర్ఎస్‌ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు ఓట్లేసి గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తాము,” అన్నారు మంత్రి హరీష్‌రావు.  

హుజూరాబాద్‌ ఉపఎన్నికలో టిఆర్ఎస్‌, బీజేపీలలో ఏది గెలిచినా రెండు పార్టీలకు పెద్దగా తేడా ఏమీ ఉండదు. కానీ తెలంగాలో ఎప్పటికైనా బీజేపీ అధికారంలోకి రాగలదా లేదా అని ఆలోచిస్తే మంత్రి హరీష్ రావు చెప్పినట్లే కష్టమనే చెప్పవచ్చు. 

అయితే తెలంగాణలో బిజెపికి ప్రధాన అవరోధం టిఆర్ఎస్‌ కాదు...బిజెపి అధిష్టానమే అని చెప్పవచ్చు. సిఎం కేసీఆర్‌ మొదలు కార్పొరేటర్ వరకు టిఆర్ఎస్‌లో అందరూ నిత్యం బిజెపిని, కేంద్రప్రభుత్వాన్ని విమర్శిస్తునే ఉంటారు. రాష్ట్రంలో బిజెపి కూడా నిత్యం టిఆర్ఎస్‌తో రాజకీయయుద్ధం చేస్తూనే ఉంటుంది. కానీ బిజెపి అధిష్టానం మాత్రం సిఎం కేసీఆర్‌తో దోస్తీ కొనసాగిస్తుంటుంది. కనుక రాష్ట్రంలో బిజెపి ఎదుగుదల అవరోధానికి బిజెపి అధిష్టానం వైఖరి కూడా ఓ కారణమని చెప్పవచ్చు. 

టిఆర్ఎస్‌తో ఏవిదంగా వ్యవహరించాలనే దానిపై బిజెపి అధిష్టానానికి స్పష్టత లేదనుకోలేము. కానీ తమ రాజకీయ అవసరాలను దృష్టిలో ఉంచుకొని టిఆర్ఎస్‌ పట్ల మెతక వైఖరి అవలంభిస్తున్నట్లు భావించవచ్చు. కనుక రాష్ట్రంలో బిజెపి ఎంతగా పోరాడుతున్నప్పటికీ ప్రయోజనం ఉండకపోవచ్చు. రాష్ట్రంలో బిజెపి చేస్తున్న ప్రయత్నాలతో వచ్చే శాసనసభ ఎన్నికల నాటికి మరికొంత బలపడి, మరికొన్ని సీట్లు గెలుచుకోగలదు తప్ప అధికారంలోకి రాలేకపోవచ్చు. కనుక ఈ విషయంలో మంత్రి హరీష్‌రావు అభిప్రాయం సరైనదే అని భావించవచ్చు.


Related Post