నేడు తెలంగాణ విమోచన దినోత్సవం

September 17, 2021


img

నిజాం పాలకుల నిరంకుశ, అరాచక, కసాయి పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి లభించిన రోజు ఇది. కనుకనే ఏటా తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుకొంటారు. ఆనాడు నిజాం రజాకార్ల చేతిలో అనేకమంది అమాయాకులు ధనమానప్రాణాలు కోల్పోయారు. మహిళలు చెప్పరాని అవమానాలకు, అత్యాచారాలకు గురయ్యారు. రజాకార్లకు వ్యతిరేకంగా జరిగిన సాయుధపోరాటంలో వేలాదిమంది చనిపోయారు. ఆనాటి వారి పోరాటాలు, రజాకార్ల ఆగడాల గురించి చెప్పాలంటే ఓ పుస్తకం కూడా సరిపోదు. నేడు తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఆనాటి ఘటనలను, చరిత్రను క్లుప్తంగా స్మరించుకోవడం ధర్మం.        

1947, ఆగస్ట్ 15వ తేదీ అర్దరాత్రి బ్రిటిష్ పాలన నుంచి భారత్‌కు విముక్తి లభించినప్పటికీ, హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న నిజాం సంస్థానం మాత్రం భారత్‌ విలీనం కాలేదు. ఆనాటి నిజాం నవాబు మీర్‌ ఉస్మాన్ అలీ ఖాన్ తన సంస్థాన్ని భారత్‌లో విలీనం చేయడానికి నిరాకరించడంతో కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీ, ఆర్యసమాజ్ అధ్వర్యంలో తిరుగుబాటు జరిగింది. వారిని రజాకర్ నాయకుడు ఖాసీం రజ్వీ అణచివేశాడు. ఎట్టి పరిస్థితులలో భారత్‌లో తమ సంస్థానాన్ని విలీనం చేసే ప్రసక్తే లేదని, ఢిల్లీలో ఎర్రకోటపై కూడా నిజాం సంస్థానపు జెండా ఎగురవేస్తామని హెచ్చరించాడు. 

తెలంగాణ, హైదరాబాద్‌, మరాట్వాడా, కర్ణాటకలలో వ్యాపించి ఉన్న నిజాం సంస్థాలను భారత్‌లో విలీనం చేయకపోతే భవిష్యత్‌లో అనేక సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని భావించిన ఆనాటి కేంద్ర హోంమంత్రి సర్ధార్ వల్లబ్ భాయ్ పటేల్, నిజాం పాలనను అంతమొందించి అతని సంస్థానాన్ని దాని ఏలుబడిలో ఉన్న ప్రాంతాలను భారత్‌లో విలీనం చేయాలని నిర్ణయించారు. దీనికోసం జనరల్స్ డీఎస్ బ్రార్, ఏఏ రుద్ర, బ్రిగేడియర్ శివదత్త నేతృత్వంలో భారత్‌ ఆర్మీ ‘ఆపరేషన్ పోలో’ పేరిట ప్రత్యక్ష యుమైంది. 

మహారాష్ట్ర, కర్ణాటక నిజాం అధీనంలో ఉన్న ప్రాంతాలన్నిటినీ వారు స్వాధీనం చేసుకొన్నారు. ఆ తరువాత నిర్మల్, వరంగల్‌, సూర్యాపేట ప్రాంతాలను స్వాధీనం చేసుకొన్నారు. భారత్‌ ఆర్మీ ధాటికి నిజాం రజాకార్లు నిలవలేక పారిపోయారు. 1948, సెప్టెంబర్ 16వ తేదీ మధ్యాహ్నం భారత్‌ ఆర్మీ హైదరాబాద్‌ను చుట్టుముట్టింది. దాంతో నిజాం నవాబు ఆర్మీ కమాండర్ ఐడ్రస్ కూడా లొంగిపోయాడు. మర్నాడు సాయంత్రం 5 గంటలకి భారత్‌ ఆర్మీ హైదరాబాద్‌ నగరాన్ని పూర్తిగా వశపరుచుకొంది. 

 అప్పుడు గానీ నిజాం నవాబు దిగిరాలేదు. తాను ఓటమిని అంగీకరించి భారత్‌ ఆర్మీకి లొంగిపోయి తన సంస్థానాన్ని భారత్‌ విలీనం చేసేందుకు సిద్దంగా ఉన్నానని నిజాం నవాబు రేడియో ద్వారా ప్రకటించాడు. అంతవరకు తనకు ఎదురే లేదని విర్రవీగిన నిజాం నవాబు, ఆనాటి కేంద్ర హోంమంత్రి సర్ధార్ వల్లబ్ భాయ్ పటేల్ ముందు చేతులు జోడించి లొంగిపోయాడు. దీంతో 1948, సెప్టెంబర్ 17వ తేదీన నిజాం సంస్థానం భారత్‌లో విలీనమైంది. 

అనేక పోరాటాలు, అనేకమంది బలిదానాలతో నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణ విముక్తి పొందింది కనుక నాటి నుంచి ఏటా ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకొంటున్నాము. 


Related Post