ఇదివరకు ఉగ్రవాదులకి, సైనికులకి మద్య చిన్నపాటి యుద్దాలు జరిగేవి. ఆ తరువాత భారత్-పాక్ దేశాల మధ్య ఐక్యరాజ్యసమితి లో దౌత్య యుద్దాలు సాగాయి. తరువాత సర్జికల్ స్ట్రయిక్ తో ఇరుదేశాల ప్రత్యక్ష యుద్ద వాతావరణం ఏర్పడింది. ప్రస్తుతం భారత్-పాక్ మీడియా మధ్య కూడా మరో యుద్ధం కొనసాగుతోంది. నిజానికి అసలు యుద్ధం కంటే అవి సృష్టిస్తున్న యుద్దవాతావరణమే చాలా ప్రమాదకరంగా ఉంది.
ఈ విషయంలో భారత్ మీడియా ప్రదర్శిస్తున్న ‘అతి’ని అందరూ చూస్తూనే ఉన్నారు కనుక మళ్ళీ దాని గురించి చెప్పుకోనవసరం లేదు. పాక్ మీడియా కూడా దానికి ఏ మాత్రం తీసిపోకుండా భారత్ గురించి, అది నిర్వహించిన సర్జికల్ స్ట్రయిక్ గురించి, ప్రధాని నరేంద్ర మోడీ గురించి చాలా చులకనగా వార్తలు, కధనాలు ప్రసారం చేస్తున్నాయి. అదే సమయంలో పాక్ ప్రజలని, పాలకులని, ప్రతిపక్షాలని రెచ్చగొట్టే విధంగా యుద్ద విశ్లేషణలు చేస్తున్నాయి.
పాక్ లోని ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక ‘డాన్’ లో భారత్ గురించి వ్రాసింది చదవితే నవ్వు రాకమానదు. “ఎప్పడూ శాంతి ప్రవచనాలు వల్లె వేసే భారత్ ప్రస్తుతం యుద్ధోన్మాదంతో ఊగిపోతోంది. అందుకు ప్రధాన కారణం ఆ దేశ రాజకీయాలలో హిందూ మతశక్తుల ప్రభావం పెరిగిపోవడమే. వారి కారణంగా ఆసియా ఖండంలో శాంతికి భంగం వాటిల్లే ప్రమాదం ఏర్పడుతోంది. యూరీలో జరిగిన ఉగ్రవాదుల దాడులలో 19మంది భారత్ సైనికులు ప్రాణాలు కోల్పోవడం అందరూ ఖండించవలసిందే. కానీ అందుకు ప్రతిగా భారత్ ప్రభుత్వం, ముఖ్యంగా భారత్ మీడియా వ్యవహరిస్తున్న తీరు ఏమాత్రం సరిగ్గా లేదు. స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం న్యూడిల్లీ ఆరాటపడుతుంటే, భారత్ జాతీయ మీడియా కూడా దానిలో భాగం పంచుకొంతోంది. కాశ్మీర్ ప్రజలపై భారత సైనికులు చేస్తున్న దాడుల గురించి చర్చించవలసిన భారత్ పాలకులు, మీడియా పాక్ తో యుద్ధం చేయడం గురించే ఎక్కువ ఆలోచిస్తున్నారు. అందుకే మోడీ పాక్ పట్ల ఆ విధంగా వ్యవహరిస్తున్నారు,” అని వ్రాసింది.
“భారత్, పాక్ భౌగోళిక పరిస్థితుల కారణంగా, పాకిస్తాన్ని అంతర్జాతీయంగా ఏకాకీ చేయడం సాధ్యం కాదని భారత్ కి కూడా తెలుసు. చైనా, రష్యాలు పాకిస్తాన్ కి బహిరంగంగానే మద్దతు ప్రకటించాయి. భారత్ కి మిత్రదేశమైన ఇరాన్ కూడా మాతో కలిసి పనిచేయడానికి సానుకూలంగా ఉంది. పాకిస్తాన్ని పక్కన పెట్టాలని భారత్ చేసిన విజ్ఞప్తిని అమెరికా కూడా పట్టించుకోలేదు. మోడీ ప్రభుత్వం జాతీయవాదం సెంటిమెంటు ఆధారంగానే అధికారంలోకి వచ్చింది. వచ్చే ఏడాది భారత్ లో అనేక రాష్ట్రాలలో ఎన్నికలు జరుగబోతున్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకొనే మోడీ ప్రభుత్వం మళ్ళీ ప్రజలలో ఆ సెంటిమెంటుని రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తోంది."
"ఇస్లామాబాద్ లో జరుగబోయే సార్క్ దేశాల సమావేశాలని భారత్ తో సహా కొన్ని పొరుగు దేశాలు కూడా బహిష్కరిస్తున్నట్లు ప్రకటించాయి. అవి భారత్ ఒత్తిడికి తలొగ్గే ఆ నిర్ణయాన్ని తీసుకొన్నాయని చెప్పవచ్చు,” అని డాన్ పత్రిక తన దేశానికి అనుకూలంగా పాకిస్తాన్ కోణంలో నుంచే ఈ సమస్యని విశ్లేషిస్తూ ఈ వ్యాసం ప్రచురించింది.
అసలు ఇటువంటి యుద్ద పరిస్థితి ఎందుకు, ఎప్పటి నుంచ ఏర్పడింది? దానికి కారకులు ఎవరు? మన దేశ పాలకులు విధనాలు సరైనవేనా? అని ప్రశ్నించుకొని నిజాయితీగా వాటి సమాధానాలు కోసం ఆలోచించుకొని ఉంటే పాకిస్తాన్ కి ఎంతో మేలు జరిగేది. పాక్ పాలకులు దాని సైనికాధికారులు, చివరికి మీడియా కూడా తమ తప్పులని, పాపాలని, భయాలని, ఆలోచనలని భారత్ కి ఆపాదించి తృప్తి పడుతుంటే ఎవరు మాత్రం కాదంటారు. దాని వలన నష్టపోయేది వారే కానీ భారత్ కాదు కదా?