యూపీ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రియాంకా వాద్రా?

September 15, 2021


img

నెహ్రూ కుటుంబ సభ్యులు ఇంతవరకు దేశాన్ని పాలించారు తప్ప రాష్ట్ర స్థాయిలో పదవులు, అధికారం ఆశించలేదు. అయితే తొలిసారిగా ప్రియాంకా వాద్రా వచ్చే ఏడాది జరుగబోయే యూపీ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా శాసనసభకు పోటీ చేయబోతున్నట్లు తాజా సమాచారం. 

సుమారు మూడు దశాబ్ధాలుగా కాంగ్రెస్ పార్టీ యూపీలో అధికారాన్ని చేజిక్కించుకోలేకపోతోంది. కనుక ఈసారి ప్రియాంకా వాద్రా ముఖ్యమంత్రి అభ్యర్ధిగా బరిలో దిగితే యూపీలో అధికారం చేజిక్కించుకోవచ్చని కాంగ్రెస్‌ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ పార్టీకి కంచుకోటల వంటి రాయ్ బరేలీ లేదా అమెధీ నియోజకవర్గాలలో ఏదో ఓ చోటు నుంచి ఆమె శాసనసభకు పోటీ చేయవచ్చని సమాచారం. ఈ విషయం కాంగ్రెస్‌ వర్గాల నుంచే బయటకు పొక్కినప్పటికీ ఈ వార్తలను కాంగ్రెస్ పార్టీ ఇంకా అధికారికంగా దృవీకరించవలసి ఉంది. 

ప్రస్తుతం యూపీలో అధికారంలో ఉన్న బిజెపి ఎట్టి పరిస్థితులలో మళ్ళీ అధికారంలోకి రావాలని ఇప్పటి నుంచే సన్నాహాలు చేస్తోంది. గతంలో అధికారంలో ఉన్న అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ, మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ వాదీ పార్టీలు కూడా ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. 

కాంగ్రెస్‌తో పొత్తులు పెట్టుకోబోమని అఖిలేశ్ యాదవ్ ప్రకటించేశారు. మాయావతి మళ్ళీ ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని తహతహలాడుతున్నారు కనుక ఆమె కాంగ్రెస్‌ పార్టీతో పొత్తులు పెట్టుకొన్నప్పటికీ నామమాత్రపు సీట్లు కేటాయించవచ్చు. 

కనుక ఈసారి యూపీ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్‌, బిజెపి, ఎస్పీ, బీఎస్పీల మద్య చతుర్ముఖపోటీ తప్పకపోవచ్చు. ఇంత తీవ్రమైన పోటీలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొనేందుకు ప్రియాంకా వాద్రాను ముఖ్యమంత్రి అభ్యర్ధిగా బరిలో దింపడమే ఏకైక మార్గమని కాంగ్రెస్‌ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ప్రియాంకా వాద్రా బరిలో దిగబోతుండటం నిజమే అయితే ఈసారి యూపీ శాసనసభ ఎన్నికలు చాలా రసవత్తరంగా సాగుతాయి. Related Post