పన్ను వాటాపై మంత్రి కేటీఆర్‌ వాదన సమంజసమేనా?

September 15, 2021


img

మంత్రి కేటీఆర్‌ నిన్న గద్వాల్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగిస్తూ గత ఆరున్నరేళ్ళలో తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్రానికి రూ.2.72 లక్షల కోట్లు పన్నుల రూపంలో వెళ్ళగా కేంద్రం తిరిగిఇచ్చింది మాత్రం కేవలం రూ.1.42 లక్షల కోట్లు మాత్రమేనని అన్నారు. మన కష్టార్జితాన్ని కేంద్రప్రభుత్వం బిజెపి పాలిత రాష్ట్రాలలో ఖర్చు చేస్తోందని మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు.

దేశంలో అత్యధికంగా పన్ను రూపంలో కేంద్రానికి ఆదాయం సమకూర్చుతున్న రాష్ట్రాలలో తెలంగాణ కూడా ఒకటిగా నిలుస్తుండటం రాష్ట్రానికి, ప్రజలకీ కూడా గర్వకారణమే. రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్ళినదానిలో రూ.1.42 లక్షల కోట్లు తిరిగి వచ్చిందని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. తెలంగాణ నుంచి కేంద్రానికి వెళ్ళిన పన్ను మొత్తం తిరిగి రావాలనుకోవడం అసంబద్దమే కనుక రాష్ట్రానికి ఇంకా ఎంత సొమ్ము తిరిగి ఇస్తే సబబో మంత్రి కేటీఆరే చెప్పాల్సి ఉంటుంది. 

దేశంలో తెలంగాణతో సహా అన్ని రాష్ట్రాల నుంచి పన్నురూపంలో వచ్చే ఆదాయంతోనే కేంద్రప్రభుత్వం నడుస్తుంటుంది. ఆ ఆదాయంలో నుంచే దేశ రక్షణ, లక్షలమంది సైనికులు, త్రివిద దళాల నిర్వహణ, వారి జీతభత్యాలు, యుద్ధవిమానాలు, ఆయుధాల కొనుగోలు, రాష్ట్రపతి, ప్రధాని, కేంద్రమంత్రులు, కేంద్రప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు, వేలాది కేంద్రప్రభుత్వం సంస్థలు, కార్యాలయాల నిర్వహణ, అన్ని రాష్ట్రాలలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వంటివన్నీ నిర్వహిస్తుంటుంది. కనుక దేశ నిర్వహణ కోసం అన్ని రాష్ట్రాలు తోడ్పడాల్సిందే. కనుక రాష్ట్రాలు చెల్లించే పన్నును పూర్తిగా లేదా 75-90 శాతం వెనక్కు రావాలని కోరుకోవడం సరికాదనే చెప్పవచ్చు.  

అయితే బిజెపి రాజకీయ ప్రయోజనాల కోసం అంటే ఎన్నికలలో గెలిచేందుకు కేంద్రప్రభుత్వం, రాష్ట్రాలు చెల్లిస్తున్న పన్నుసొమ్మును ఓటర్లకు ఏవో పధకాల పేరుతో పంచిపెట్టడం కూడా సరికాదనే చెప్పాలి. అయితే తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఇదే వర్తిస్తుంది. దళిత బంధు వంటి సంక్షేమ పధకాలతో టిఆర్ఎస్‌ పార్టీ ఎన్నికలలో రాజకీయ లబ్ధి పొందాలనుకొంటోంది కనుక ప్రజాధనాన్ని ఖర్చు చేయడంలో కేంద్రప్రభుత్వం చేస్తున్న తప్పునే రాష్ట్ర ప్రభుత్వం కూడా చేస్తోందని చెప్పక తప్పదు. ఈ పధకంతో దళితులను ఆదుకోవడం తప్పు కాదు కానీ ఒక్కో కుటుంబానికి పదేసి లక్షల చొప్పున రాష్ట్రంలో లక్షల మందికి పంచిపెట్టడం సాధ్యమా కాదా? ప్రభుత్వం ఈ భారం ఎవరిపై వేస్తుంది?అని ఆలోచిస్తే అర్ధమవుతుంది. 

రాష్ట్రాలు చెల్లిస్తున్న పన్ను సొమ్మును కేంద్రం విచ్చలవిడిగా ఖర్చు చేయడంపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నప్పుడు, రాష్ట్రంలో వివిద వర్గాల ప్రజలు చెల్లిస్తున్న పన్నులతో సమకూరుతున్న సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం ఇష్టారీతిన ఖర్చు చేయడం కూడా తప్పే అవుతుంది కదా? ప్రజాధనానికి కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ధర్మకర్తలుగా వ్యవహరించాలి తప్ప దానిని తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేయడాన్ని ఎవరూ సమర్ధించరు...హర్షించరు. 


Related Post