ఏపీ, తెలంగాణల విద్యుత్ వివాదం హైకోర్టుకి

September 14, 2021


img

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు వేరుపడి ఏడేళ్ళయ్యింది. కానీ ఇంతవరకు రెండు రాష్ట్రాల మద్య నెలకొన్న అనేక వివాదాలు పరిష్కరించుకోలేక, హైకోర్టు, సుప్రీంకోర్టు, ట్రిబ్యూనల్స్‌లో పోరాడుకొంటూనే ఉన్నాయి. తాజాగా ఏపీ జెన్‌కో ఎండీ బి.శ్రీధర్ తెలంగాణ విద్యుత్ సంస్థలపై హైకోర్టులో పిటిషన్‌ వేశారు.  

2014లో రాష్ట్రాలు విడిపోయినప్పటి నుంచి మూడేళ్ళపాటు తెలంగాణ రాష్ట్రానికి ఏపీ నుంచి విద్యుత్ సరఫరా చేశామని కానీ నేటి వరకు ఆ బకాయిలను చెల్లించలేదని శ్రీధర్ పిటిషన్‌లో పేర్కొనారు. తెలంగాణ విద్యుత్ సంస్థల నుంచి ఏపీ జెన్‌కోకు రూ.3,441.78 కోట్లు బాకీ, దానిపై వడ్డీ మరో రూ.2,841.90 కోట్లు కలిపి మొత్తం రూ. 6,283.68 కోట్లు బాకీ రావలసి ఉందని తెలిపారు. కనుక ఆ బకాయిలను వీలైనంత త్వరగా వడ్డీతో కలిపి చెల్లించవలసిందిగా తెలంగాణ విద్యుత్ సంస్థలను ఆదేశించవలసిందిగా ఎండీ బి.శ్రీధర్ పిటిషన్‌ ద్వారా హైకోర్టును కోరారు. ఏపీ జెన్‌కో ఎండీ బి.శ్రీధర్ దాఖలు చేసిన ఈ పిటిషన్‌లో ప్రతివాదులుగా తెలంగాణ విద్యుత్ శాఖ, టీఎస్పీడీసీఎల్, టీఎన్పీడీసీఎల్ సంస్థలను పేర్కొన్నారు.   

దీనిపై తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రామచంద్రరావు, జస్టిస్ వినోద్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ కేసు తదుపరి విచారణ అక్టోబర్ 28కి వాయిదా వేస్తూ అప్పటిలోగా తెలంగాణ విద్యుత్ సంస్థల తరపున కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. 


Related Post