గుజరాత్‌ సిఎం విజయ్ రూపానీ రాజీనామా

September 11, 2021


img

గుజరాత్‌ సిఎం విజయ్ రూపానీ శనివారం తన పదవికి రాజీనామా చేశారు. గవర్నర్‌ ఆచార్య దేవవ్రత్‌ను కలిసి తన రాజీనామా పత్రం సమర్పించారు. గవర్నర్‌కు రాజీనామా పత్రాన్ని సమర్పించి బయటకు వచ్చిన తరువాత మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్రాభివృద్ధి కోసమే రాజీనామా చేస్తున్నాను. ఇంతకాలం ముఖ్యమంత్రిగా గుజరాత్‌ అభివృద్ధి చేసేందుకు నాకు అవకాశం కల్పించినందుకు మా అధిష్టానానికి కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను. ఇంతకాలం నాకు మార్గదర్శనం చేసిన ప్రధాని నరేంద్రమోడీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను. నూతన నాయకత్వంలో రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాను,” అని అన్నారు. 

విజయ్ రూపానీ 2016, ఆగస్ట్ 7వ తేదీన గుజరాత్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. శాసనసభ ఎన్నికలకు ఇంకా 15 నెలల సమయం ఉంది కనుక ఆయనకు అంతవరకు ముఖ్యమంత్రిగా కొనసాగవచ్చు. రాష్ట్రంలో...రాష్ట్ర బిజెపిలో ఎటువంటి రాజకీయ సమస్యలు లేవనే చెప్పవచ్చు. కానీ 15 నెలలు ముందుగానే రాజీనామా చేశారంటే, బిజెపి అధిష్టానం ఆదేశాల మేరకే ముఖ్యమంత్రి కుర్చీలో నుంచి దిగిపోయారని స్పష్టమవుతోంది. 

ఎన్నికలలోగా రాష్ట్రంలో 10 శాతం జనాభా ఉన్న పటేల్ సామాజిక వర్గాన్ని ప్రసన్నం చేసుకొనేందుకు ఆ వర్గానికి చెందిన నేతకు ముఖ్యమంత్రి పదవి కట్టబెటాలనే ఆలోచనతోనే విజయ్ రూపానీ చేత రాజీనామా చేయించినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

ఆదివారం అహ్మదాబాద్‌లో బిజెపి శాసనసభాపక్షం సమావేశం నిర్వహించి కొత్త నాయకుడిని ఎన్నుకోనున్నారు. కనుక గుజరాత్‌ కొత్త ముఖ్యమంత్రి ఎవరనేది రేపు సాయంత్రంలోగా తెలియవచ్చు. ముఖ్యమంత్రి రేసులో గుజరాత్‌ ఉపముఖ్యమంత్రి నితిన్ పటేల్, రాష్ట్ర బిజెపి ఉపాధ్యక్షుడు సీఆర్ పటేల్ ఉన్నారు.


Related Post