కేసీఆర్‌ ప్రధాని మోడీని కలవడంలో తప్పులేదు: ఈటల

September 11, 2021


img

సిఎం కేసీఆర్‌ పార్టీ కార్యాలయం శంఖుస్థాపనకని ఢిల్లీకి వెళ్ళి ఆ తరువాత వారం రోజులు అక్కడే మకాం వేసి ప్రధాని నరేంద్రమోడీతో సహా పలువురు కేంద్రమంత్రులను కలిసి రాష్ట్రానికి సంబందించిన సమస్యలపై చర్చించి తిరిగి వచ్చారు. కేసీఆర్‌ ఢిల్లీ పర్యటన చేసినప్పుడల్లా టిఆర్ఎస్‌, బిజెపిల మద్య ఏదో ఉందని కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తుంటారు. వాటితో టిఆర్ఎస్‌కు ఎటువంటి నష్టమూ లేదు కనుక టిఆర్ఎస్‌ నేతలు పెద్దగా స్పందించారు. కానీ కాంగ్రెస్‌ చేస్తున్న ఈ వాదనలతో ప్రజలలో బిజెపిపై అనుమానాలు పెరుగుతాయి. కనుక కేసీఆర్‌ ఢిల్లీ పర్యటనకు వెళ్ళి వచ్చిన ప్రతీసారి పిల్లికి చెలగాటం ఎలక్కి ప్రాణసంకటం అన్నట్లవుతుంటుంది. అప్పుడు కాంగ్రెస్‌ విమర్శించడం దానికి బిజెపి నేతలు సంజాయిషీలు ఇచ్చుకోవడం పరిపాటిగా మారింది. 

ఈటల రాజేందర్‌ హుజూరాబాద్‌ ఉపఎన్నికలో బిజెపి అభ్యర్ధిగా పోటీ చేయబోతునందున ఈసారి ఆయన కూడా కాంగ్రెస్‌ ఆరోపణలపై సిఎం కేసీఆర్‌ను వెనకేసుకువస్తూ సంజాయిషీ ఇచ్చుకోవలసి వచ్చింది. హుజూరాబాద్‌లో నిన్న మీడియాతో మాట్లాడుతూ, “సిఎం కేసీఆర్‌ ఈ ఉపఎన్నికలో ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టినప్పటికీ ఇక్కడ గెలిచేది నేనే. ఈవిషయంలో అనుమానం అక్కరలేదు. సిఎం హోదాలో కేసీఆర్‌ ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీని కలవడంలో తప్పు లేదని భావిస్తున్నాను. సిఎం కేసీఆర్‌కు ప్రధాని నరేంద్రమోడీ అపాయింట్ ఇచ్చినంత మాత్రన్న టిఆర్ఎస్‌-బిజెపిల మద్య ఏదో ఉందని విమర్శించడం సరికాదు. టిఆర్ఎస్‌ బిజెపికి ఎప్పుడూ రాజకీయంగా శత్రువే,” అని అన్నారు.  


Related Post