మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలంటే ఒక పెద్ద హీరో సూపర్ హిట్ సినిమా అంత వినోదాన్ని ప్రజలకు పంచిపెడుతుంటాయి. సినిమాలకైతే టికెట్ కొనుక్కోవాలి మా ఎన్నికల వినోదం చూసేందుకు టికెట్ అవసరం కూడా ఉండదు. మా ఎన్నికలలో నటీనటుల కీచులాటలతో తెలుగు సినీ పరిశ్రమ పరువు గంగలో కలిసిపోతోందని తెలిసినా, ప్రజలు తమను చూసి నవ్వుకొంటున్నారని తెలిసి ఉన్నా మా ఎన్నికలలోఅందరూ తలోచెయ్యి వేసి చివరి వరకు రక్తి కట్టిస్తుంటారు. ఇప్పుడూ అదే జరుగుతోంది. తాజాగా కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు, మెగా బ్రదర్ నాగబాబుకు మద్య జరిగిన ఓ వాగ్వాదంతో మా ఎన్నికలు మరింత రక్తికట్టాయి.
కిందటి నెల మా క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజు అధ్యక్షతన మా ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే అంశంపై వర్చువల్ పద్దతిలో సమావేశమైంది. దీనిలో పాల్గొన్న మోహన్‌బాబు అడిగిన ఓ ప్రశ్న నాగబాబుకి చాలా కోపం తెప్పించింది.
ఇంతకీ మోహన్‌బాబు ఏమడిగారంటే, ‘ఎక్కువ డబ్బు పెట్టి కొన్న మా భవనాన్ని తక్కువ ధరకు ఎందుకు అమ్మేశారని, ఇదంతా చూస్తున్న సినీ పెద్దలు ఎందుకు స్పందించలేదని’ ప్రశ్నించారు.
దీనిపై నాగబాబు స్పందిస్తూ, “ఆ భవనం కొన్నప్పుడు అంటే 2006-2008లో నేనే మా అధ్యక్షుడిగా ఉన్నాను. దానిని రూ.71.73 లక్షలకు కొని మరో మూడు లక్షలు పెట్టి రిన్నోవేషన్ చేయించాము. నేను అధ్యక్ష పదవి నుంచి తప్పుకొన్నా తరువాత నరేశ్ ఆ పదవి చేపట్టారు. దానిని ఆయన హయాంలోనే రూ.30 లక్షలకు అమ్మేశారు. కనుక మీరు నరేష్ ను ప్రశ్నించాలి కానీ నన్ను కాదు. నేను కూడా దీని గురించి నరేష్ ను సంజాయిషీ అడుగుతాను. ఈ వ్యవహారంలో మళ్ళీ నన్ను ఎవరైనా నిలదీస్తే తీవ్రంగా స్పందిస్తాను,” అంటూ ఘాటుగా జవాబిచ్చారు.