జాతీయ కాంగ్రెస్‌కు ఓ రేవంత్‌ రెడ్డి కావాలి

September 09, 2021


img

వరుస ఓటములతో నిర్వీర్యంగా మారిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పగ్గాలను రేవంత్‌ రెడ్డికి అప్పగించడంతో మళ్ళీ ఆ పార్టీలో నూతనోత్సాహం కనిపిస్తోంది. పార్టీ పరిస్థితిలో ఇప్పుడు స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. కనుక ఈ క్రెడిట్ ఖచ్చితంగా రేవంత్‌ రెడ్డిదే. 

జాతీయస్థాయిలో కాంగ్రెస్ పరిస్థితి టి-కాంగ్రెస్‌కు భిన్నంగా లేదు. 2014 సార్వత్రిక ఎన్నికలలో బిజెపి చేతిలో ఓడిపోయినప్పటి నుంచి కాంగ్రెస్ పరిస్థితి నానాటికీ దయనీయంగా మారుతోంది. ఆనాడు పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. కానీ మళ్ళీ ఇప్పుడు ఆయనకే పార్టీ పగ్గాలు అప్పగించబోతునట్లు వార్తలు వస్తున్నాయి. రాహుల్ గాంధీ పార్టీని గెలిపించుకోలేకపోవడం తప్పు కాదు కానీ పార్టీకి ధైర్యం చెప్పి ముందుకు నడిపించాల్సిన సమయంలో అస్త్రసన్యాసం చేయడమే పెద్ద తప్పు! 

తెలంగాణలో దయనీయ పరిస్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేతబట్టిన రేవంత్‌ రెడ్డి చాలా నిబ్బరంగా నిలబడి పార్టీ శ్రేణులలో ఆత్మవిశ్వాసం నింపుతూ ఓ పక్క అత్యంత శక్తివంతమైన టిఆర్ఎస్‌, బిజెపీలను ఎదుర్కొంటూనే, మరోపక్క పార్టీని బలోపేతం చేసుకొనేందుకు మళ్ళీ పార్టీని ప్రజలకు చేరువ చేసేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. నాయకత్వ లక్షణాలు అంటే ఇవే. రాహుల్ గాంధీకి ఇవే లోపించాయి. కనుకనే పార్టీలో సీనియర్లు ఆయన నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. 

ఇక్కడ రేవంత్‌ రెడ్డి కూడా సీనియర్ల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. కానీ రాహుల్ గాంధీలా భయపడి అస్త్రసన్యాసం చేయడంలేదు. పైగా జమ్మి చెట్టుపై దాచిన అస్త్రశస్త్రాలను దించి యుద్ధానికి సిద్దమైన అర్జునుడిలా ఒంటరిగా పోరాడుతున్నారు. కనుక జాతీయస్థాయి కాంగ్రెస్ పార్టీ బతికి బట్ట కట్టాలంటే అక్కడ కూడా రేవంత్‌ రెడ్డి వంటి నాయకత్వ లక్షణాలు కలిగిన సమర్దులైన యువనేతకు పార్టీ పగ్గాలు అప్పగించి అతను లేదా ఆమె నేతృత్వంలో రాహుల్ గాంధీ పనిచేయడం మంచిది. రాహుల్ గాంధీ నిజంగా కాంగ్రెస్ పార్టీ శ్రేయస్సు కోరుకొంటున్నట్లయితే ఈ త్యాగం చేయక తప్పదు. లేకుంటే కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యం చెల్లించక తప్పదు. 


Related Post