హుజూరాబాద్‌ ఉపఎన్నికను ఎవరు తెచ్చారు?

September 09, 2021


img

హుజూరాబాద్‌ ఉపఎన్నికలో టిఆర్ఎస్‌ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను గెలిపించుకోవడానికి మంత్రి హరీష్‌రావు రంగంలో దిగిన సంగతి తెల్సిందే. ఆయన సుమారు నెలరోజులుగా నియోజకవర్గంలోనే మకాం వేసి కులాలవారీగా ఓటర్లను కలిసి ప్రసన్నం చేసుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. నిన్న దేశాయిపల్లిలో ముదిరాజ్ కులస్తులతో ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతూ, ఈటల రాజేందర్‌ తన స్వార్ధం కోసమే ఉపఎన్నికలు తెచ్చిపెట్టి ఇప్పుడు ఓడిపోతానేమోనని భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. 

అయితే ఈటల రాజేందర్‌ స్వార్ధంతో ఉపఎన్నిక తెచ్చారనడం సరికాదనే చెప్పాలి. ఆయనను మంత్రివర్గం నుంచి తొలగించిన తరువాత తన రాజకీయ భవిష్యత్‌ కోసం బిజెపిలో చేరారు. ఏ రాజకీయ నాయకుడైన అదే చేస్తాడు. ఎమ్మెల్యేగా ఉంటూ బిజెపిలో చేరితే ఆయనపై అనర్హతవేటు వేసేందుకు టిఆర్ఎస్‌ వెనకాడదు. కనుకనే ఆయన తన పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది. ఒకవేళ ప్రభుత్వం నుంచి ఆయనను తొలగించకపోయినా, అనర్హతవేటుతో రాజకీయ ప్రతీకారానికి పాల్పడదనే నమ్మకమున్నా ఆయన రాజీనామా చేసేవారు కాదు...ఈ ఉపఎన్నిక వచ్చేదే కాదు. కనుక ఈ విషయంలో పూర్తిగా ఆయనదే తప్పని చెప్పలేము. 

ఈ ఉపఎన్నికలో ఓడిపోతానేమో అని ఆయన భయపడుతున్నారనే మాట పూర్తిగా వాస్తవం కాదు. టిఆర్ఎస్‌కు కూడా ఓటమి భయం ఉంది. ఈ ఉపఎన్నికను వాయిదా వేయించడం, దళిత బంధు పధకం ప్రకటన, హుజూరాబాద్‌లో సిఎం కేసీఆర్‌ సభ, నియోజకవర్గంలో దాని పైలట్ ప్రాజెక్టు అమలు, నెలరోజులుగా మంత్రి హరీష్‌రావు నియోజకవర్గంలో మకాం వేయడం వంటివన్నీ కళ్ళకు కనిపిస్తున్న ప్రత్యక్ష నిదర్శనాలు. కనుక ఉపఎన్నిక ఫలితంపై ఈటల రాజేందర్‌ ఎంత ఆందోళన చెందుతున్నారో టిఆర్ఎస్‌ కూడా అంతే ఆందోళన చెందుతోందని చెప్పవచ్చు. 

అయితే ఇదంతా టిఆర్ఎస్‌ స్వయంకృతాపరాదమని చెప్పక తప్పదు. ఏవిదంగా అంటే... ఈ ఉపఎన్నిక విషయంలో టిఆర్ఎస్‌ అత్యుత్సాహం ప్రదర్శించి స్వయంగా హైప్ క్రియేట్ చేసినందునే ఇది ప్రతిష్టాత్మకంగా మారిందని చెప్పవచ్చు. ప్రతీ చిన్నా పెద్ద ఎన్నికను ప్రతిష్టాత్మకంగా భావించడం వలననే టిఆర్ఎస్‌కు ఇటువంటి కష్టాలు ఎదురవుతుంటాయి. ఈ ఉపఎన్నికలో గెలిచినా ఓడినా టిఆర్ఎస్‌కు వచ్చే లాభం, నష్టం ఏమీ ఉండదని తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చెపుతున్నారు. మరి అటువంటప్పుడు మంత్రి హరీష్‌రావు నెలరోజులుగా హుజూరాబాద్‌లో మకాం వేయడం దేనికి?ఈ ఉపఎన్నిక కోసం హడావుడి చేయడం దేనికి?ఇప్పుడు చింతించడం దేనికి?కనుక ఇది టిఆర్ఎస్‌ స్వయంకృతాపరాదమే అని చెప్పక తప్పదు.


Related Post