తెలంగాణలో బిజెపి అధికారంలోకి వస్తే... బండి సంజయ్‌

September 08, 2021


img

రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ మంగళవారం ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా సంగారెడ్డిలో పాదయాత్ర చేసి అక్కడ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సంచలన ప్రకటన చేశారు. “2023లో జరుగబోయే శాసనసభ ఎన్నికలలో మా పార్టీ తప్పకుండా గెలుస్తుంది. రాష్ట్రంలో మేము అధికారంలోకి వస్తే యూపీ ప్రభుత్వంలాగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒకరు లేదా ఇద్దరు పిల్లలు మాత్రమే కలిగి ఉండాలనే చట్టం తీసుకోవస్తాము. ‘ఒకరు ముద్దు, ఇద్దరు హద్దు, ముగ్గురు వద్దేవద్దు...’అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళతాము. 

యూపీ ప్రభుత్వం జనాభా నియంత్రణకు ప్రయత్నిస్తుంటే ఇక్కడ కేసీఆర్‌ సర్కార్ ముస్లింలకు రిజిస్ట్రేషన్లంటున్నారు. ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్నవారు ఎన్నికలలో పోటీ చేయడానికి వీలులేకపోవడంతో మజ్లీస్ మెప్పు కోసం హడావుడిగా చట్టం చేయాలని ప్రయత్నించారు కానీ మేము అడ్డుకోవడంతో ఆగిపోయారు. 

మేము పాతబస్తీలోనే బహిరంగ సభ నిర్వహించి మా సత్తా చాటుకొన్నాము కానీ సిఎం కేసీఆర్‌ ఇంతవరకు పాతబస్తీలో అడుగు పెట్టలేకపోతున్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని మేము చాలా కాలంగా ప్రభుత్వాన్ని కోరుతున్నా సిఎం కేసీఆర్‌ మజ్లీస్ పార్టీకి భయపడి నిర్వహించడం లేదు. కనీసం ఈసారైనా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కోరుతున్నాను,” అని బండి సంజయ్‌ అన్నారు. 

బిజెపి, మజ్లీస్ పార్టీలు ఉప్పు, నిప్పు వంటివే అయినా అవి పనిచేసే తీరు ఒకటే. రెండూ మతం ఆధారంగానే రాజకీయాలు చేస్తుంటాయి. దేనినైనా మతం కోణంలో నుంచే చూస్తుంటాయి. మత కోణంలో నుంచే వ్యూహాలు అమలుచేస్తూ రాజకీయంగా లబ్ది పొందాలని ప్రయత్నిస్తుంటాయి. ఈ ప్రయత్నంలో బిజెపి ముస్లింలను, మజ్లీస్ హిందువులను దూరం చేసుకొనేందుకు కూడా వెనకాడవు. అలాగైతేనే అనేక పార్టీల మద్య చీలిపోయిన హిందువులను బిజెపి, ముస్లింలను మజ్లీస్ పార్టీ ఆకర్షించి ఓటు బ్యాంకుగా మలుచుకోగలుగుతాయి. ఇప్పుడు బండి సంజయ్‌ కూడా ఇటువంటి మాటలతో అదే ప్రయత్నం చేస్తున్నారని అర్ధమవుతూనే ఉంది.


Related Post