తాలిబన్ ప్రభుత్వం పట్ల భారత్‌ వైఖరి ఏమిటి?

September 08, 2021


img

నిన్న మొన్నటివరకు మారణాయుధాలతో విధ్వంసం సృష్టిస్తూ వేలాదిమంది అమాయక ప్రజలను అతికిరాతకంగా హతమార్చిన తాలిబన్లు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసుకొన్నారు. వారిలో కొందరి తలలకు అమెరికా భారీ నజరానాలు కూడా ప్రకటించింది. కానీ ఇప్పుడు వారు ఓ ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని ఆ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కనుక ఇప్పుడు వారితో ఏవిదంగా వ్యవహరించాలనే దానిపై ప్రపంచదేశాలన్నీ ఆలోచిస్తున్నాయి. వాటిలో భారత్‌ కూడా ఒకటి. 

ఆఫ్ఘనిస్తాన్‌ పునర్నిర్మాణంలో భాగంగా ఆ దేశంలో భారత్‌ వేలకోట్లు పెట్టుబడులు పెట్టి అనేక ప్రాజెక్టులు నిర్మిస్తోంది. వాటిని, వాటిపై పెట్టిన పెట్టుబడులను కాపాడుకోవాలంటే కేంద్రప్రభుత్వం తాలిబన్ల ప్రభుత్వంతో చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. భారత్‌తో సత్సంబంధాలు కోరుకొంటున్నామని తాలిబన్లు చెప్పినప్పటికీ భారత్‌ స్పందించలేదు. ఎందుకంటే తాలిబన్లతో స్నేహామంటే అది విషసర్పంతో స్నేహమే అవుతుంది. కానీ ఆ విషసర్పంతో భారత్‌కు చాలా ప్రమాదం పొంచి ఉన్నందున దానిని అదుపులో ఉంచడానికి ఏదో ఓ విదంగా దానిని మచ్చిక చేసుకోక తప్పదు. లేకుంటే ఇప్పటికే తాలిబన్లతో ప్రత్యక్షంగా చేతులు కలిపి వారి ప్రభుత్వ ఏర్పాటుకు అన్నివిదాల సహకరిస్తున్న పాకిస్థాన్‌ గుప్పెట్లోకి తాలిబన్ ప్రభుత్వం వెళ్లిపోయే ప్రమాదం ఉంది. 

మజ్లీస్ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం యూపీలో పర్యటిస్తున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ, “తాలిబన్ ప్రభుత్వంపై పాకిస్థాన్‌ ప్రభావం చూపితే అది భారత్‌కు చాలా ప్రమాదకరంగా మారుతుంది. కనుక తాలిబన్ ప్రభుత్వంతో భారత్‌ ప్రభుత్వం ఏవిదంగా వ్యవహరిస్తుంది?తాలిబన్ ప్రభుత్వం పట్ల భారత్‌ వైఖరి ఏమిటి?” అని ప్రశ్నించారు. 

ఈ ప్రశ్నకు ‘స్నేహం చేస్తామనో లేదా దూరంగా ఉంటామనో’ సమాధానం చెప్పడం సులువు కాదు. కనుక భారత్‌ కూడా తన వైఖరిని బయటపెట్టకుండా తాలిబన్ ప్రభుత్వ తీరుతెన్నులను బట్టి స్పందించేందుకు వేచి చూస్తోంది. 



Related Post