తెలంగాణ ప్రభుత్వానికి, కౌశిక్ రెడ్డికి గవర్నర్‌ షాక్

September 08, 2021


img

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ రాష్ట్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్‌ నుంచి టిఆర్ఎస్‌లో చేరిన కౌశిక్ రెడ్డికి ఊహించని విదంగా షాక్ ఇస్తున్నారు. గత నెల 1వ తేదీన కౌశిక్ రెడ్డి పేరును గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా సిఫార్సు చేస్తూ లేఖ పంపింది కానీ నేటికీ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ దానికి  ఆమోదం తెలుపలేదు. అలాగని తిరస్కరించి పంపలేదు. 

ఇటీవల రాజ్‌భవన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె దీనిపై స్పందిస్తూ, “తెలంగాణ ప్రభుత్వం పంపిన సిఫార్సు పత్రం నాకు అందింది. గవర్నర్‌ కోటాలో సామాజిక సేవ చేస్తున్నవారికి, కళాకారులు లేదా సాహితీవేత్తలను ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తుండటం ఆనవాయితీ. కనుక కౌశిక్ రెడ్డి బయోడేటాను మరోసారి ఈ కోణంలో నుంచి పరిశీలించాలని అనుకొంటున్నాను. ఇందుకు నాకు మరికొంత సమయం అవసరం,” అని అన్నారు. 

హుజూరాబాద్‌ ఉపఎన్నికలో కాంగ్రెస్‌ తరపున పోటీ చేయాలనుకొన్న కౌశిక్ రెడ్డి టిఆర్ఎస్‌ నుంచి ఆఫర్ రావడంతో నోరుజారి ఆవిషయం బయటపెట్టుకొని విమర్శలు ఎదుర్కొన్నారు. కనుక టిఆర్ఎస్‌లో చేరినప్పటికీ హుజూరాబాద్‌ నుంచి పోటీ చేయలేని పరిస్థితి ఏర్పడటంతో సిఎం కేసీఆర్‌ ఆయనకు ఇచ్చినమాటను నిలబెట్టుకొనేందుకు గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేయాలని సిఫార్సు చేశారు. దీనిపై గవర్నర్‌ అసంతృప్తి చెంది ఆ సిఫార్సుకు ఆమోదముద్ర వేయకుండా పక్కన పెట్టారు. 

తద్వారా టిఆర్ఎస్‌ రాజకీయ అవసరాలు, ప్రయోజనాల కోసం ఆనవాయితీకి విరుద్దంగా వ్యవహరించలేనని చెప్పకనే చెప్పారు. గవర్నర్‌ నుంచి ఇటువంటి ప్రతిస్పందన ఊహించని టిఆర్ఎస్‌ ప్రభుత్వానికి, కౌశిక్ రెడ్డికి దీనిని జీర్ణించుకోవడం కష్టమే. అయితే గవర్నర్‌ ఆ సిఫార్సు లేఖను తిరస్కరించి పంపి ఉంటే పునః పరిశీలించమని కోరుతూ మళ్ళీ తిప్పి పంపించవచ్చు. అప్పుడు దానిని గవర్నర్‌ ఆమోదించవలసి ఉంటుంది లేదా మళ్ళీ ఇలాగే పక్కన పెట్టవచ్చు కూడా. ఒకవేళ గవర్నర్‌ తమిళిసై కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీగా నామినేట్ చేసేందుకు తిరస్కరిస్తే అది టిఆర్ఎస్‌ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతుంది కనుక దానికీ, గవర్నర్‌కు మద్య ఘర్షణ వాతావరణం ఏర్పడవచ్చు.


Related Post