మమతా దీదీ మళ్ళీ ఓడిపోతే?

September 06, 2021


img

ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ నెలలో జరిగిన పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 213 సీట్లు గెలుచుకొని మళ్ళీ అధికారంలోకి వచ్చింది. కానీ ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ మాత్రం ఓడిపోయారు. కానీ మళ్ళీ ఆమే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే రాజ్యాంగం ప్రకారం మంత్రి లేదా ముఖ్యమంత్రి పదవి చేపట్టినవారు తప్పనిసరిగా శాసనసభ లేదా మండలిలో సభ్యులై ఉండాలి. ఒకవేళ కాకపోతే పదవి చేపట్టినప్పటి నుంచి ఆరు నెలల లోపుగా తప్పనిసరిగా శాసనసభ లేదా మండలికి ఎన్నికవ్వాలి లేకుంటే పదవికి రాజీనామా చేయక తప్పదు. 

కనుక రాష్ట్రంలో భవానీపూర్ నియోజకవర్గం నుంచి ఈనెల 30న జరుగబోయే ఉపఎన్నికలో పోటీ చేసేందుకు మమతా బెనర్జీ సిద్దమయ్యారు. ఆమెను ఈ ఉపఎన్నికలో కూడా ఓడిపోతే సిఎం పదవి చేపట్టలేరు. అప్పుడు పార్టీలో సీనియర్ నేతలలో ఎవరో ఒకరిని సిఎం కుర్చీలో కూర్చోబెట్టి తాను రిమోట్ కంట్రోల్ పద్దతిలో పాలన సాగించవలసి వస్తుంది. అది పార్టీలో సంక్షోభానికి దారి తీసినా ఆశ్చర్యం లేదు. కనుక ఈ ఉపఎన్నికలో మమతా బెనర్జీ గెలవనీయకుండా అడ్డుకొనేందుకు బిజెపి గట్టి ప్రయత్నాలే చేయడం తధ్యం. 

ఒకవేళ మమతా బెనర్జీ ఈ ఉపఎన్నికలో గెలిస్తే ఏ సమస్యా ఉండదు కానీ దీనిలో కూడా ఓడిపోతే ఆమె ముందు ఒకే ఒక ప్రత్యామ్నాయ మార్గం మిగిలి ఉంటుంది. తృణమూల్ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఎలాగూ ఆమెనే శాసనసభాపక్ష నేతగా ఎన్నుకొంటారు కనుక ఆమె తన పదవికి రాజీనామా చేసి మద్యలో ఒకరోజు గ్యాప్ ఇచ్చి మర్నాడు మళ్ళీ సిఎంగా ప్రమాణ స్వీకారం చేయవచ్చు. అయితే పక్కా బిజెపి మనిషిగా వ్యవహరించే గవర్నర్‌ జగదీప్ థన్‌కర్ అందుకు అంగీకరించకపోవచ్చు లేదా అభ్యంతరం చెప్పవచ్చు. కనుక ఈ ఉపఎన్నికలో మమతా బెనర్జీ తప్పనిసరిగా గెలిచి తీరాలి. సెప్టెంబర్ 30న ఉపఎన్నిక నిర్వహించి అక్టోబర్ 3న ఈసీ ఫలితాలు ప్రకటిస్తుంది.


Related Post