హుజూరాబాద్‌లో టిఆర్ఎస్‌ ముందే ఓటమిని అంగీకరిస్తోందా?

September 06, 2021


img

హుజూరాబాద్‌ ఉపఎన్నిక జరగడం ఖాయం అయిన తరువాత టిఆర్ఎస్‌ చాలా ఉత్సాహంగా ఉరకలు వేస్తూ పని మొదలుపెట్టేసింది. దళిత బంధు పధకం, దానిని హుజూరాబాద్‌లో ప్రారంభించడం, పధకం ప్రకటించిన పది రోజులలోపే రూ.2000 కోట్లు విడుదల చేయడం, ఎన్నికల వ్యూహ నిపుణుడిగా పేరొందిన మంత్రి హరీష్‌రావును రంగంలో దింపడం, ఈటల రాజేందర్‌ అనుచరులను టిఆర్ఎస్‌వైపు తిప్పుకోవడం వంటివన్నీ ఉపఎన్నిక కోసమే అని అందరికీ తెలుసు. ఈ ఉపఎన్నికలో టిఆర్ఎస్‌ భారీ మెజార్టీతో గెలుపు ఖాయమని మంత్రి హరీష్‌రావు గట్టిగా నొక్కి చెపుతున్నారు. కానీ కరోనా, పండుగల సీజన్ సాకుతో టిఆర్ఎస్‌ ప్రభుత్వం ఉపఎన్నికను వాయిదా వేయించడం మంత్రులు కేటీఆర్‌, సత్యవతి రాథోడ్ మాటలు మంత్రి హరీష్‌రావు చెపుతున్న మాటలకు భిన్నంగా ఉన్నాయి. 

మంత్రి కేటీఆర్‌ కొన్ని రోజుల క్రితం టిఆర్ఎస్‌ పార్టీ సమావేశంలో మాట్లాడుతూ, “హుజూరాబాద్‌ ఉపఎన్నికలో ఓడిపోయినంత మాత్రన్న మన ప్రభుత్వం పడిపోదు... గెలిచినంత మాత్రన్న ఢిల్లీలో అధికారంలోకి రాదు. ఈ ఉపఎన్నిక మనకు చాలా చిన్న విషయం కనుక ఎప్పుడూ దాని గురించే ఆలోచిస్తూ కూర్చోలేము,” అని అన్నారు. 

తాజాగా మంత్రి సత్యవతి రాథోడ్ ఆదివారం మంచిర్యాల జిల్లా తిమ్మాపూర్ మండలంలోని ఎల్ఎండీ గెస్ట్ హౌస్ వద్ద మీడియాతో మాట్లాడుతూ, “మా ప్రభుత్వానికి 105 మంది ఎమ్మెల్యేలున్నారు. కనుక ఒక్క హుజూరాబాద్‌ సీటు లేనంతమాత్రన్న టిఆర్ఎస్‌ రాజకీయంగా వచ్చే నష్టం ఏమీ లేదు,” అని అన్నారు. 

ఎన్నడూ మెజార్టీ గురించే తప్ప ఓటమి గురించి మాట్లాడని టిఆర్ఎస్‌ నేతలు, దళిత బంధు పేరుతో తలకు మించిన భారం ఎత్తుకొని ఇంత హడావుడి చేసిన తరువాత ఇప్పుడు ఈవిదంగా మాట్లాడుతున్నారంటే వారికి ఉపఎన్నికలో టిఆర్ఎస్‌ గెలుస్తుందనే నమ్మకం తగ్గినట్లుంది. బహుశః అందుకే నియోజకవర్గంలో పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకొనేందుకు వీలుగా ఉపఎన్నికను ఆలస్యం చేసిందేమో? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.


Related Post