నేను పార్టీ మారడం లేదు: తుమ్మల నాగేశ్వరరావు

September 06, 2021


img

గత ప్రభుత్వంలో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా ఓ వెలుగు వెలిగిన తుమ్మల నాగేశ్వరరావును సిఎం కేసీఆర్‌ పక్కన పెట్టడంతో చాలా కాలంగా పార్టీ సమావేశాలకు, కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. టిఆర్ఎస్‌కు ఆయనకు మద్య దూరం పెరగడంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే ఆలోచనలో ఉన్నట్లు సోషల్ మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

ఇదే విషయంపై మీడియా ప్రతినిధులు ఆయనను ప్రశ్నించగా అవన్నీ పుకార్లేనని కొట్టిపడేశారు. ఖమ్మం జిల్లాలో చెన్నారంలో ఓ కార్యక్రమానికి వచ్చినప్పుడు దీని గురించి మాట్లాడుతూ, “ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసమే సిఎం కేసీఆర్‌ నన్ను టిఆర్ఎస్‌ పార్టీలో తీసుకొన్నారు. నేను మంత్రిగా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జిల్లాలో పలు అభివృద్ధి పనులు చేశాను. మళ్ళీ మంత్రి పదవి లభించనంత మాత్రన్న నేను కాంగ్రెస్‌ పార్టీలో చేరుతాననుకోవడం సరికాదు. నేను ఎప్పటికీ టిఆర్ఎస్‌ పార్టీలోనే ఉంటాను. సిఎం కేసీఆర్‌ నాయకత్వంలోనే పనిచేస్తాను. అయినా సోషల్ మీడియాలో నా గురించి ఎవరో ఏదో వ్రాస్తుంటే వాటన్నిటికీ సమాధానాలు చెప్పుకోవలసిన అవసరం లేదు,” అని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

అయితే మంత్రిగా ఓ వెలుగు వెలిగిన ఓ రాజకీయ నాయకుడు ఇన్నేళ్ళు రాజకీయాలకు దూరంగా ఉండటం లేదా ఉంచడం అంటే అది రాజకీయంగా ఆత్మహత్యతో సమానమే అని చెప్పవచ్చు. ఇందుకు మోత్కుపల్లి నర్సింహులు ఒక ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవచ్చు. చంద్రబాబునాయుడు తనకు తప్పకుండా గవర్నర్‌ పదవి ఇప్పిస్తారనే ఆశతో అనేక ఏళ్ళు రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. గవర్నర్‌ పదవి రాలేదు కానీ రాజకీయాలలో వెనకబడిపోయారు. మళ్ళీ నిలద్రొక్కుకోవడానికి చాలా ప్రయత్నిస్తున్నారు కానీ ఇంతవరకు రాజకీయంగా స్థిరపడలేకపోయారు. కనుక తుమ్మల నాగేశ్వరరావు పరిస్థితి కూడా అదే. తుమ్మల మాదిరిగా పక్కన పెట్టబడిన నేతలు టిఆర్ఎస్‌లో చాలా మందే ఉన్నారు. గత ప్రభుత్వంలో ఓ వెలుగు వెలిగిన కడియం శ్రీహరి, జూపల్లి కృష్ణారావు, పద్మా దేవేందర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వంటివారు చాలా మందే ఉన్నారు. మరి వారి పరిస్థితి ఏమిటో వారికే తెలియాలి.


Related Post