ఉపఎన్నిక ఆలస్యం...కేసీఆర్‌ వ్యూహమేనా?

September 04, 2021


img

కేంద్ర ఎన్నికల సంఘం శనివారం మధ్యాహ్నం ఉపఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది కానీ దానిలో హుజూరాబాద్‌ ఉపఎన్నిక లేదు. ఏపీ, తెలంగాణతో దేశంలో 11 రాష్ట్రాలలో ఉపఎన్నికలు జరుగవలసి ఉండగా కరోనా, వర్షాలు, పండుగల సీజను కారణంగా ఇప్పుడే ఎన్నికలు నిర్వహించవద్దని కోరినట్లు ఈసీ తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం కూడా హుజూరాబాద్‌ ఉపఎన్నిక పండుగల సీజన్ పూర్తయిన తరువాతే జరుపాలని కోరిందని కనుక షెడ్యూల్ ప్రకటించలేదని ఈసీ తెలిపింది. పండుగల సీజన్ ముగిసిన తరువాత మళ్ళీ మరోసారి రాష్ట్ర ప్రభుత్వాలను సంపారించింది ఉపఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తామని ఈసీ తెలిపింది. 

హుజూరాబాద్‌ ఉపఎన్నిక ఆలస్యమైతే ప్రధానంగా ఈటల రాజేందర్‌పై చాలా భారం పడుతుంది. మే మొదటివారంలో టిఆర్ఎస్‌ ప్రభుత్వం నుంచి బహిష్కరింపబడినప్పటి నుంచి నేటి వరకు అంటే గత 4 నెలలుగా ఈటల రాజేందర్‌ ఈ ఉపఎన్నిక కోసం హుజూరాబాద్‌ నియోజకవర్గంలో పాదయాత్రలు, సమావేశాలు, ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. తన అనుచరులు జారిపోకుండా ఉండేందుకు చాలా తిప్పలు పడుతున్నారు. ఇప్పుడు మరో రెండు నెలలపాటు వీటన్నిటినీ కొనసాగించాలంటే ఆర్ధికంగా ఆయనకు చాలా భారం అవుతుంది. 

ఈ ఉపఎన్నికలో గెలవాలని చాలా పట్టుదలగా ఉన్న టిఆర్ఎస్‌కు కూడా ఇది చాలా భారమే అవుతుంది కానీ అధికారంలో ఉన్నందున ఈ అదనపు భారాన్ని భరించే శక్తి ఉంది. ఉపఎన్నిక ఆలస్యమైతే హుజూరాబాద్‌లో పరిస్థితులు అనుకూలంగా మలుచుకొనేందుకు టిఆర్ఎస్‌కు కావలసినంత సమయం కూడా లభిస్తుంది. కనుక ఉపఎన్నిక ఆలస్యమైతే నష్టపోయేది ఈటల రాజేందర్‌ అని చెప్పక తప్పదు. బహుశః ఇది కూడా సిఎం కేసీఆర్‌ ఉపఎన్నిక వ్యూహంలో భాగమే అయినా ఆశ్చర్యం లేదు.  

ఓటమి భయంతోనే సిఎం కేసీఆర్‌ ఈ ఉపఎన్నికను వాయిదా వేయించారని ఈటల రాజేందర్‌ వాదించవచ్చు కానీ దాని వలన టిఆర్ఎస్‌కు ఎటువంటి నష్టమూ ఉండదు. 


Related Post