టాలీవుడ్ పరేషాన్...పరేషాన్!

September 04, 2021


img

దేశంలో బాలీవుడ్ తరువాత స్థానంలో నిలుస్తున్న తెలుగు సినీ పరిశ్రమ (టాలీవుడ్) ప్రస్తుతం తీవ్ర ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఓ వైపు మా ఎన్నికలతో పరిశ్రమలో నటీనటుల మద్య మళ్ళీ కుమ్ములాటలు జరుగుతుండగా మరోవైపు మాదకద్రవ్యాల మనీలాండరింగ్ కేసులో ఈడీ సినీ పరిశ్రమలో పలువురు ప్రముఖులను రోజూ విచారిస్తోంది.

మా ఎన్నికలు జరిగే వరకు టాలీవుడ్‌లో అందరూ ఓ కుటుంబంలా పనిచేస్తున్నట్లనిపిస్తుంది. వారి మద్య ఎటువంటి విభేధాలు, బేషజాలు, సమస్యలు లేవనిపిస్తుంది. కానీ ఒక్కసారి మా ఎన్నికల హడావుడి మొదలైతే అందరూ మీడియా ముందుకువచ్చి కుమ్ములాడుకొంటూ సినిమాహాల్స్ అవసరం లేకుండానే ప్రజలకు కాలక్షేపం, వినోదం పంచిపెడుతూ టాలీవుడ్‌ పరువు తీసుకొంటారు.  

ఇది సరిపోదన్నట్లు ఇప్పుడు టాలీవుడ్‌ ప్రముఖులను ఈడీ సుదీర్గంగా విచారిస్తుండటం, వారికి మాదకద్రవ్యాల వాడకం లేదా వాటి విక్రయించేవారితో సంబంధాలున్నట్లు ఈడీ విచారణలో తేలిందంటూ మీడియాలో వస్తున వార్తలు తెలుగు సినీ పరిశ్రమ పేరుప్రతిష్టలకు భంగం కలిగిస్తోంది. 

అయితే సినీ పరిశ్రమ ఎల్లప్పుడూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంటుంది కనుక దానిలో జరిగే ఎంత చిన్న విషయమైన దానిని ప్రజలు భూతద్దంలో పెట్టి చూస్తుంటారు. కనుకనే ఇటువంటివాటికి హైప్ ఏర్పడుతోందని, అయితే ఒక్క సినీ పరిశ్రమలోనే కాదు ప్రతీ రంగంలోనూ ఇటువంటివి జరుగుతూనే ఉంటాయని కానీ వాటిని మీడియా, ప్రజలు పెద్దగా పట్టించుకోరని వాదిస్తుంటారు. ఇది నిజమే కానీ సినీ పరిశ్రమలో కుమ్ములాటలు, మాదక ద్రవ్యాల వాడకం తెలుగు సినీ పరిశ్రమకు గౌరవప్రదం కాబోదు కదా? సినీ పరిశ్రమలో మాదక ద్రవ్యాలను సినీ పెద్దలు అడ్డుకోలేకపోవచ్చు కనీసం మా కుమ్ములాటలు నివారించి టాలీవుడ్‌ పరువు కాపాడవచ్చు కదా? 


Related Post