టిఆర్ఎస్‌-బిజెపి ఎన్నటికీ కలవవు: బండి సంజయ్

September 04, 2021


img

తెలంగాణ రాష్ట్రంలో బిజెపి టిఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని ప్రయత్నిస్తోంది. కానీ ప్రధాని నరేంద్రమోడీ-సిఎం కేసీఆర్‌ల భేటీలు, రాష్ట్ర ప్రభుత్వానికి అవార్డులు, కేంద్రమంత్రుల కితాబులు, పార్లమెంటులో బిజెపికి టిఆర్ఎస్‌ మద్దతు పలుకుతుండటం లేదా సానుకూలంగా వ్యవహరిస్తుండటం...వంటివన్నీ ప్రజలకు టిఆర్ఎస్‌-బిజెపిల మద్య ఏదో ఉందని ప్రజలు అనుమానించేలా చేస్తోంది. అందుకే టిఆర్ఎస్‌-బిజెపిల మద్య రహస్య అవగాహన ఉందని కాంగ్రెస్ పార్టీ పదేపదే ఆరోపిస్తుంటుంది. ఈ ఆరోపణలు, అనుమానాలు, అపోహల వలన టిఆర్ఎస్‌కు లాభమే తప్ప వచ్చే నష్టం ఏమీ లేదు. కానీ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలనుకొంటున్న బిజెపి విశ్వసనీయతే దెబ్బతింటోంది. ఈవిషయం రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌తో సహా అందరికీ తెలుసు. అందుకే నిన్న వికారాబాద్‌ జిల్లా పూడూరు మండలంలో ప్రజా సంగ్రామ యాత్రలో ప్రధాని నరేంద్రమోడీ-కేసీఆర్‌ భేటీ గురించి ఆయన ప్రజలకు సంజాయిషీ చెప్పుకొన్నారనుకోవచ్చు.  

బండి సంజయ్‌ ప్రజలనుద్దేశ్యించి మాట్లాడుతూ, “ప్రధాని నరేంద్రమోడీ యావత్ దేశప్రజలందరినీ సమానంగా చూస్తారు. అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాధాన్యత ఇస్తారు. అందుకే సిఎం కేసీఆర్‌ ఎప్పుడు అపాయింట్మెంట్ అడిగినా కాదనకుండా ఇచ్చి భేటీ అవుతుంటారు. దాని గురించి సిఎం కేసీఆర్‌ తన అనుకూల మీడియాలో గొప్పగా వ్రాయించుకొని ప్రచారం చేసుకొంటుంటారు. ప్రధాని నరేంద్రమోడీ, సిఎం కేసీఆర్‌తో భేటీ అయినంత మాత్రన్న టిఆర్ఎస్‌, బిజెపిలు చేతులు కలిపాయనుకోవడం సరికాదు. టిఆర్ఎస్‌తో మా పార్టీ ఎన్నటికీ చేతులు కలపదు. తెలంగాణకు ద్రోహం చేస్తున్న కేసీఆర్‌తో మా పార్టీ ఎన్నటికీ కలిసి పనిచేయదు. టిఆర్ఎస్‌ మాకు రాజకీయ శత్రువు,” అని అన్నారు.

తెలంగాణలో బండి సంజయ్‌ ప్రజా సంగ్రామ యాత్రలో టిఆర్ఎస్‌ ప్రభుత్వంపై విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తుంటే, అక్కడ ఢిల్లీలో సిఎం కేసీఆర్‌ ప్రధాని నరేంద్రమోడీని వరాలు కోరడం, యాదాద్రిలో జరుగబోయే సుదర్శన యాగానికి ఆహ్వానించడం, అందుకు ఆయన వెంటనే సానుకూలంగా స్పందించడం విశేషమే కదా?


Related Post