బిజెపి నేత ఈటల రాజేందర్ హుజూరాబాద్ ఉపఎన్నికలో తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని, మంత్రి హరీష్‌రావు కూడా సిద్దమేనా?అని సవాల్ విసిరారు. హుజూరాబాద్‌లో టిఆర్ఎస్ గెలుపు తధ్యమని దానిని ఎవరూ అడ్డుకోలేరని మంత్రి హరీష్‌రావు పదేపదే చాలా నమ్మకంగా చెపుతున్నారు. కనుక ఈటల సవాలును స్వీకరించడానికి ఆయన సంకోచించాల్సిన అవసరమే లేదని చెప్పవచ్చు. కానీ ఈటల సవాలుపై హరీష్‌రావు ఇంకా స్పందించవలసి ఉంది.
అయితే హుజూరాబాద్‌లో ఓడిపోతే రాజకీయాల నుంచి శాశ్వితంగా తప్పుకోవడానికి సిద్దమని ఈటల రాజేందర్ సవాల్ విసరడాన్ని రెండువిదాలుగా చూడవచ్చు. 1. హుజూరాబాద్‌లో పరిస్థితులను అంచనా వేసుకొని ఉపఎన్నికలో తానే తప్పకుండా గెలుస్తాననే నమ్మకం ఆయనకు కలిగి ఉండవచ్చు. 2. ఈ ఉపఎన్నికలో తనకు ఇబ్బందికరంగా మారిన మంత్రి హరీష్‌రావును ఈ ఉచ్చులోకి లాగి ఇరుకున పెట్టేందుకు ఈటల రాజేందర్ పన్నిన వ్యూహం కావచ్చు. కానీ ఎన్నికలప్పుడు రాజకీయ నాయకులు ఇటువంటి సవాళ్ళు విసురుకొంటారు తప్ప వాటికి సిద్దపదరని అందరికీ తెలుసు.