టి-కాంగ్రెస్‌లో ఉపఎన్నికల హడావుడి షురూ

September 02, 2021


img

హుజూరాబాద్‌ ఉపఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్ధి ఎంపికపై పార్టీ నేతలు గాంధీభవన్‌లో సమావేశమై చర్చించినప్పుడు కొండా సురేఖ పేరును దాదాపు ఖరారు చేసినట్లు, అందుకు ఆమె కూడా అంగీకరించరని వార్తలు వచ్చాయి. కనుక కాంగ్రెస్‌ అధిష్టానం ఆమోదం తీసుకొని నేడో రేపో ఆమె పేరు ప్రకటిస్తారనుకొంటుంటే, ఈ ఉపఎన్నికలో పోటీ చేసేందుకు ఆసక్తి గల అభ్యర్ధుల నుంచి కాంగ్రెస్ పార్టీ దరఖాస్తులు ఆహ్వానించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. 

హుజూరాబాద్‌ మండలంలో కనుకుంట్లకు చెందిన జాలి కమలాకర్ రెడ్డి, సైదాపూర్ మండలంలోని వెన్నంపల్లి గ్రామానికి చెందిన ఒంటెల లింగారెడ్డి మంగళవారం జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణను కలిసి దరఖాస్తులు సమర్పించారు. ఈ విషయం ఆయనే స్వయంగా ప్రకటిచారు. ఇంకా ఎవరైనా పోటీ చేయదలిస్తే రూ.5,000 డీడీ, బయోడేటా, పాస్‌పోర్ట్‌ సైజు ఫోటోను జతపరిచి ఈ నెల 5వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా సమర్పించవచ్చని తెలిపారు. వాటిని పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డికి అందజేస్తామని, హుజూరాబాద్‌ ఉపఎన్నికల కమిటీ వాటిని పరిశీలించిన తరువాత ఈనెల 10వ తేదీన కాంగ్రెస్‌ అభ్యర్ధి పేరును ప్రకటిస్తామని డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు.        

సాధారణ ఎన్నికలలో చాలామంది పార్టీ టికెట్ ఆశిస్తుంటారు కనుక వారి నుంచి ఈవిదంగా దరఖాస్తులు స్వీకరించడం సహజమే. కానీ ఈ ఉపఎన్నికలో టిఆర్ఎస్‌, బిజెపిలను ఢీకొనాలంటే చాలా బలమైన అభ్యర్ధి అవసరం కనుకనే కొండా సురేఖ పేరు వినిపించింది. ఈ నేపధ్యంలో ఉపఎన్నికలో పోటీ చేయడానికి ఆసక్తి ఉన్నవారినందరూ దరఖాస్తు చేసుకోవాలని కోరడం విడ్డూరంగానే ఉంది. అయితే ఈ నెల 10వ తేదీన కాంగ్రెస్‌ అభ్యర్ధి పేరు ప్రకటించే అవకాశం ఉందని డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాటలతో స్పష్టమైంది.


Related Post