అమెరికా డబ్బు, ఆయుధాలు, పరువు అన్నీ పాయె!

September 02, 2021


img

ప్రపంచశాంతిని కాపాడే బాధ్యత భుజాన్న వేసుకొన్న పెద్దన్న అమెరికాకు ఆఫ్ఘనిస్తాన్‌లో కాలు పెట్టడం తప్పని తెలుసుకోవడానికి 20 ఏళ్ళు పట్టింది! ఆఫ్ఘనిస్తాన్‌లో 20 ఏళ్ళపాటు అమెరికా శాంతి నెలకొల్పింది నిజమే కానీ అది తాత్కాలికమేనని తాలిబన్ల పునః ప్రవేశంతో స్పష్టమైంది. 

ఆఫ్ఘనిస్తాన్‌లో 20 ఏళ్ళపాటు తాలిబన్లతో యుద్ధం చేయడానికి అమెరికా లక్షల కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. వేలాదిమంది సుశిక్షితులైన అమెరికా సైనికులను, ఆత్యాధునిక ఆయుధాలను దింపింది. కానీ 20 ఏళ్ళపాటు తాలిబన్లతో పోరాడినా వారిని పూర్తిగా మట్టుబెట్టలేకపోయింది. కానీ కేవలం 70-80 వేలమంది ఉండే తాలిబన్ ముటాలను 2-3 లక్షల మంది ఆఫ్ఘన్‌ సైనికులు ఎందుకు అడ్డుకోలేకపోయారని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రశ్నించడం చాలా హాస్యాస్పదంగా ఉంది. 

ఆఫ్ఘనిస్తాన్‌లో తమ పోరాటాన్ని మద్యలోనే ముగించిన అమెరికా చివరికి ఏమి సాధించింది అంటే...కోట్ల డాలర్లు ఖర్చు చేసి నష్టపోయింది. వేలాదిమంది అమెరికన్ సైనికులను కోల్పోయింది. ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్న కోట్ల డాలర్లు విలువ చేసే అత్యాధునిక హెలికాప్టర్లు, ఆయుధాలు, వాహనాలు, అత్యాధునికమైన క్షిపణి రక్షణ వ్యవస్థలను అన్నిటినీ స్వయంగా ధ్వంసం చేసుకోవలసి వచ్చింది. ఇంత తీవ్ర నష్టం జరిగినా కనీసం పరువు కూడా కాపాడుకోలేకపోయింది. ఆఫ్ఘన్‌ ప్రజలతో సహా ప్రపంచదేశాల దృష్టిలో అమెరికా ప్రతిష్ట మసకబారింది. అయితే ఇది ఎన్నటికీ ముగిసే యుద్ధం కాదనే విషయం అమెరికాకు ఇప్పుడు బాగా అర్ధమైంది కనుక ఇకనైనా విదేశాల అంతర్గత వ్యవహారాలలో వేలు పెట్టకుండా ఉంటే మంచిది లేకుంటే మళ్ళీ ఇవే చేదు అనుభవాలు మిగులుతాయి.


Related Post