సిఎం కేసీఆర్ ఈరోజు మధ్యాహ్నం ఢిల్లీలో వసంత్ విహార్ మెట్రో స్టేషన్ సమీపంలో టిఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి భూమిపూజ చేయనున్నారు. దీనిపై దుబ్బాక బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు స్పందిస్తూ “నిత్యం కేంద్రాన్ని, జాతీయ పార్టీలను తిట్టిపోసే టిఆర్ఎస్‌కు ఢిల్లీలో పార్టీ కార్యాలయం ఎందుకు? టిఆర్ఎస్ ఢిల్లీకి బానిసగా మారాలనుకొంటోందా?” అంటూ ప్రశ్నించారు.
అయితే టిఆర్ఎస్‌కు ఢిల్లీలో ఆ భూమిని కేటాయించింది కేంద్రప్రభుత్వమేనని ఆయనకీ తెలుసు. టిఆర్ఎస్‌కు భూమి కేటాయించినప్పుడు అది పార్టీ కార్యాలయం ఎందుకు నిర్మించుకోదు?తప్పకుండా నిర్మించుకొంటుంది. కనుక అందుకు టిఆర్ఎస్‌ను రఘునందన్ రావు తప్పుపట్టడం సరికాదు. ఒకవేళ తప్పుపట్టదలిస్తే టిఆర్ఎస్‌కు భూమి కేటాయించినందుకు తమ ప్రభుత్వాన్నే ఆయన తప్పు పట్టాలి.
రాష్ట్రంలో రాజకీయశత్రువులుగా ఉన్న టిఆర్ఎస్, బిజెపిలు నిత్యం కత్తులు దూసుకొంటుంటే, తమ అధిష్టానం టిఆర్ఎస్‌కు భూమి కేటాయించి ఢిల్లీకి ఎందుకు తెచ్చిపెట్టుకోంటోంది?దానిలో పరమార్ధం ఏమిటో రఘునందన్ రావే చెప్పాల్సి ఉంటుంది. టిఆర్ఎస్, బిజెపిల మద్య రహస్య అవగాహన ఉన్నందునే అవి పైకి శత్రువుల్లా కత్తులు దూసుకొంటూ లోలోన ఈవిదంగా పరస్పరం సహకరించుకొంటున్నాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపణలకు బిజెపి నేతలే సమాధానం చెప్పాల్సి ఉంటుంది.