టీటీడీ చిల్లర సమస్యకు ధనప్రసాదంతో పరిష్కారం

September 01, 2021


img

తిరుమల శ్రీవారిని దర్శించుకొనే భక్తుల ద్వారా టీటీడీకి రోజుకి సుమారు రూ.10-20 లక్షల విలువగల చిల్లర నాణేలు పోగవుతుంటాయి. ఇదివరకు టీటీడీ వాటిని బ్యాంకులలో జమా చేసేది. కానీ ఇప్పుడు బ్యాంకులకు కూడా చిల్లర లెక్కలు చూడటం పెద్ద భారంగా మారడంతో అవీ చిల్లర తీసుకొనేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో టీటీడీ వద్ద భారీగా చిల్లర నాణేలు పేరుకుపోయాయి. వాటిని వదిలించుకొనేందుకు టీటీడీ ఒక  విన్నూత్నమైన ఐడియా కనిపెట్టింది. 

తిరుమల కొండపైన, కొండ దిగువన తిరుపతిలో టీటీడీ కాటేజీలలో దిగే భక్తుల నుంచి టీటీడీ సెక్యూరిటీ డిపాజిట్‌గా రూ.100 తీసుకొంటుంది. భక్తులు కాటేజీని ఖాళీ చేసి వెళ్లిపోయేటప్పుడు దానిని వారికి తిరిగి ఇస్తుంటుంది. నేటి నుంచే భక్తులకు రూ.100 నోటుకు బదులు వంద రూపాయి నాణేలను ప్యాకెట్లుగా కట్టి ఇవ్వాలని టీటీడీ నిర్ణయించింది. అయితే వాటిని భక్తులు అంగీకరించకపోతే ఇబ్బందవుతుంది కనుక దానికి ‘శ్రీవారి ధన ప్రసాదం’ అనే పేరు పెట్టింది టీటీడీ! 

శ్రీవారి ప్రసాదాన్ని ఎవరూ కాదనలేరు. అదీ...స్వామివారిస్తున్న డబ్బును ఎవరూ కాదనలేరు. కాదంటే లక్ష్మీదేవిని తిరస్కరించిన్నట్లే అవుతుంది. పైగా దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ప్రయాణ సమయంలో ఆ మాత్రం చిల్లర అవసరం పడుతుంది కూడా. కనుక శ్రీవారి ధన ప్రసాదాన్ని ఎవరూ కాదనకపోవచ్చు. ఈవిదంగా టీటీడీ తన చిల్లర సమస్యను పరిష్కరించుకోవాలని ప్రయత్నిస్తోంది. ఈ ఐడియా ఫలిస్తే తరువాత రూ.2,5 నాణేలను కూడా పోట్లాలు కట్టి ‘శ్రీవారి ధన ప్రసాదం’ పేరుతో భక్తులకు పంపిణీ చేయాలని టీటీడీ భావిస్తోంది.


Related Post