విద్యార్దుల తల్లితండ్రులలో అయోమయం

September 01, 2021


img

నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు తెరుచుకొన్నాయి. ఇంతకాలం పాఠశాలలు తెరవకపోవడంతో తమ పిల్లల చదువులు ఏమవుతాయో అని ఆందోళన చెందుతున్న తల్లితండ్రులు, ఇప్పుడు కరోనా భయంతో పిల్లలను పాఠశాలలకు పంపాలా వద్దా అనే అయోమయంలో పడ్డారు. 

ఇంచుమించు ఏడాదిగా బడికి దూరమైన పిల్లలు, ఆన్‌లైన్‌లో పాఠాలను అర్ధంచేసుకోలేక ఇబ్బందులు పడుతున్నారు.  బడికి వెళ్ళకపోవడం వలన వారిలో శారీరిక, మానసిక మార్పులను చూస్తున్న తల్లితండ్రులు వారిని బడికి పంపించడమే మంచిదని భావిస్తున్నారు. మళ్ళీ కరోనా మొదలైతే పాఠశాలలు మళ్ళీ మూతపడతాయి కనుక అప్పటివరకైనా పిల్లలను బడికి పంపిస్తే మంచిదని భావిస్తున్నారు. 

అయితే పిల్లలకు కరోనా సోకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొంటామని విద్యాశాఖ, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్స్ చెపుతున్నప్పటికీ చాలామంది తల్లితండ్రులు ధైర్యం చేయలేకపోతున్నారు. ఎందుకంటే, పెద్దవారే కరోనా జాగ్రత్తలు పాటించకుండా తిరుగుతున్నప్పుడు, కరోనా గురించి ఏమాత్రం అవగాహన లేని పిల్లలతో ఏవిదంగా జాగ్రత్తలు పాటింపజేస్తారని తల్లితండ్రుల ప్రశ్న. ముఖ్యంగా ఆటోలు, బస్సులు ఎక్కి పాఠశాలలకు చేరుకోవలసిన విద్యార్దులకు దారిలోనే ఎవరి ద్వారానైనా కరోనా అంటుకొనే ప్రమాదం ఉంటుంది. వారి ద్వారా పాఠశాలలో ఇతర విద్యార్దులకు వ్యాపించే ప్రమాదం ఉంటుంది. కనుక పిల్లలను బడికి పంపిస్తే వారికి కరోనా సోకుతుందేమోనని తల్లితండ్రులు ఆందోళన చెందుతున్నారు. 

ఇంతవరకు 18 ఏళ్ళు పైబడినవారికి మాత్రమే టీకాలు వేస్తున్నారు. కనుక టీకాలు వేయకుండా చిన్నపిల్లలను బడికి పంపించడం ప్రమాదమని భావిస్తున్న తల్లితండ్రులు ఉన్నారు. ఒకవేళ పిల్లలకు కరోనా సోకినట్లయితే వారిని కాపాడుకోవడానికి మళ్ళీ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ వాటికి లక్షలు కుమ్మరించాల్సి ఉంటుంది. పైగా పిల్లల ద్వారా మళ్ళీ ఇంట్లో పెద్దవాళ్ళకి కూడా కరోనా వ్యాపించే ప్రమాదం ఉంటుంది. కనుక కాస్త కష్టమైనా ఆన్‌లైన్‌లో చదివించుకోవడమే మంచిదని భావిస్తున్నవారూ ఉన్నారు.  

కానీ ప్రభుత్వ పాఠశాలలో చదువుకొనే విద్యార్దులలో 99 శాతం నిరుపేద కుటుంబాల నుంచి వచ్చినవారే కనుక వారికి కంప్యూటర్లు, లాప్ టాపులు కొనివ్వగల స్థోమత వారి తల్లితండ్రులకు ఉండకపోవచ్చు. కనుక వారు తమ పిల్లలను పాఠశాలలకు పంపించక తప్పదు. కనుక ప్రభుత్వ పాఠశాలలో మొదటిరోజు నుంచే పిల్లల హాజరు బాగానే ఉండవచ్చు. 

ఏది ఏమైనప్పటికీ, నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు తెరుచుకొన్నాయి గనుక విద్యాశాఖ అధికారులు, తల్లితండ్రులు, ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్స్, మున్సిపల్, వైద్యఆరోగ్యశాఖ సిబ్బంది ప్రతీ ఒక్కరూ పిల్లలకు కరోనా సోకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవలసిందే లేకుంటే ఆ తరువాత వగచి ప్రయోజనం ఉండదు.


Related Post