బీఎస్పీలోకి వలసలు షురూ

September 01, 2021


img

తెలంగాణ రాష్ట్రంలో బీఎస్పీ ఎప్పటి నుంచో ఉంది కానీ మాజీ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్‌ వచ్చి చేరే వరకు పెద్దగా గుర్తింపుకు నోచుకోలేదు. ప్రవీణ్ కుమార్‌ బీఎస్పీ కన్వీనర్‌గా బాధ్యతలు చేపట్టిన తరువాత రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ సభలు, సమావేశాలలో చురుకుగా పాల్గొంటున్నారు. రాష్ట్రంలో బడుగుబలహీన వర్గాల ప్రజలందరినీ సమైక్యపరిచి బీఎస్పీకి మద్దతు కూడగట్టేందుకు గట్టిగా కృషి చేస్తున్నారు. అందరూ సమైక్యంగా నిలిస్తే వచ్చే శాసనసభ ఎన్నికలలో టిఆర్ఎస్‌ను ఓడించి అధికారంలోకి వస్తామని నమ్మకంగా చెపుతున్నారు. 

ఇప్పటికే ఆయన సభలు, సమావేశాలకు బడుగుబలహీన వర్గాల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇప్పుడు ఆయన ప్రభావం రాజకీయ పార్టీలపై కూడా పడుతోంది. బిజెపి ముషీరాబాద్ నియోజకవర్గం కన్వీనర్‌ కేయల్ సత్యనారాయణ మంగళవారం తన పదవికి, పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేసి బీఎస్పీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. ప్రవీణ్ కుమార్‌ ఆశయాలు, సిద్దాంతాలపట్ల ఆకర్షితుడనై బీఎస్పీలో చేరుతున్నానని, ఆయన సారధ్యంలో రాష్ట్రంలో బీఎస్పీ బలీయమైన రాజకీయ శక్తిగా రూపొందుతుందని భావిస్తున్నానని సత్యనారాయణ చెప్పారు. 

ఇది ప్రవీణ్ కుమార్‌ నాయకత్వంపై నమ్మకాన్ని సూచిస్తున్నట్లు భావించవచ్చు. ఒకవేళ రాబోయే రోజుల్లో ఇతర పార్టీలలో నుంచి నేతలు బీఎస్పీలోకి చేరుతున్నట్లయితే, రాష్ట్రంలో బీఎస్పీ బలపడుతునట్లే. అప్పుడు మరో 20 ఏళ్ళు తామే అధికారంలో ఉంటామని భావిస్తున్న టిఆర్ఎస్‌ ముందుగా మేల్కొవలసి ఉంటుంది.


Related Post