తాలిబన్లతో భారత్‌ చర్చలు!

August 31, 2021


img

ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్‌ తాలిబన్ ఉగ్రవాదుల చేతుల్లో ఉంది కనుక వారి ప్రభుత్వాన్ని, అధికారాన్ని గుర్తించాలా వద్దా?అనే సందేహం అన్ని దేశాలలో నెలకొని ఉంది. తాము భారత్‌తో సహా అన్ని దేశాలతో సత్సంబంధాలు కోరుకొంటున్నామని తాలిబన్లు ప్రకటించారు. భారత్‌ కూడా ఆఫ్ఘనిస్తాన్‌లో పరిస్థితులను నిశితంగా గమనిస్తూ తొలి అడుగు వేసింది. 

ఖతార్‌లోని భారత్‌ రాయబారి దీపక్ మిట్టల్ భారత్‌ ప్రభుత్వం తరపున దోహాలోని భారత రాయబార కార్యాలయంలో తాలిబన్ల రాజకీయ ప్రతినిధి షేర్ మహమ్మద్ అబ్బాస్‌తో మంగళవారం తొలిసారిగా సమావేశమయ్యారు. ఈవిషయం భారత్‌ విదేశాంగ శాఖ దృవీకరించింది. 

ఈ సమావేశంలో ప్రధానంగా ఆఫ్ఘనిస్తాన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను, ముఖ్యంగా మైనార్టీలను సురక్షితంగా స్వదేశానికి తరలింపులో తాలిబన్లు భారత్‌కు సహకరించాలని దీపక్ మిట్టల్ కోరినట్లు విదేశాంగశాఖ తెలిపింది. రెండో ప్రధానాంశంగా ఆఫ్ఘనిస్తాన్‌లో భారత్‌ వ్యతిరేక శక్తులకు చోటు కల్పించరాదని, ఎటువంటి ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించకూడదని కోరినట్లు తెలిపింది. ఈ రెండు ప్రతిపాదనలకు తాలిబన్ల ప్రతినిధి సానుకూలంగా స్పందించినట్లు విదేశాంగశాఖ తెలిపింది. 

అయితే తాలిబన్ల వంటి కరడుగట్టిన ఉగ్రవాదులు, మత ఛాందసవాదులతో ఎంతో కాలం సత్సంబందాలు కొనసాగించడం కష్టమే. కానీ ఆఫ్ఘనిస్తాన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను సురక్షితంగా వెనక్కు తీసుకురావడానికి భారత్‌ తాలిబన్లతో చర్చలకు సిద్దపడకతప్పలేదనుకోవాలి. లేకుంటే వారిని బందీలుగా పట్టుకొని తాలిబన్లు భారత్‌ను బ్లాక్ మెయిల్ చేసే ప్రమాదం ఉంది. బహుశః ఇదే కారణంగా త్వరలోనే ఇతర దేశాలు కూడా తాలిబన్లతో చర్చలు ప్రారంభించవచ్చు.


Related Post