ఆఫ్ఘన్‌ ప్రజలకు శుభాకాంక్షలు: తాలిబన్లు

August 31, 2021


img

తాలిబన్లకు భయపడి రెండువారాల వ్యవధిలో లక్షలాదిమంది ఆఫ్ఘన్‌ పౌరులు ప్రాణాలరచేతిలో పెట్టుకొని పారిపోగా, మిగిలినవారు బిక్కుబిక్కుమంటూ భయంతో బతుకుతున్నారు. వారికి తాలిబన్లు శుభాకాంక్షలు తెలియజేయడం విశేషం. ఈరోజు తెల్లవారుజామున కాబూల్ విమానాశ్రయం నుంచి మిగిలిన అమెరికా సైనికులు అందరూ స్వదేశానికి తిరిగి వెళ్ళిపోవడంతో తాలిబన్లు తుపాకులతో గాలిలో కాల్పులు జరుపుతూ సంబరాలు జరుపుకొన్నారు. 

తాలిబన్ల అధికార ప్రతినిధి జూబీహుల్లా ముజాహిద్ కాబూల్లో మీడియాతో మాట్లాడుతూ, “ఈ సందర్భంగా ఆఫ్ఘనిస్తాన్‌ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇది మనందరి విజయం. మనదేశ చరిత్రలో ఇదొక గొప్ప విజయంగా నిలిచిపోతుంది. ఇప్పుడు మనకు పూర్తి స్వేచ్చా స్వాతంత్రాలు లభించాయి. ఆఫ్ఘనిస్తాన్‌ ఆక్రమించుకోవాలని ప్రయత్నించేవారికి ఇదే ఓ గుణపాఠం. అమెరికాతో సహా ప్రపంచదేశాలన్నిటితో మేము సత్సంబంధాలు కోరుకొంటున్నాము. అన్ని దేశాలతో దౌత్య సంబంధాలను పునరుద్దరించుకోవాలని మేము కోరుకొంటున్నాము,” అని అన్నారు.       

తాలిబన్ల పునః ప్రవేశంతో తమ స్వేచ్చాస్వాతంత్ర్యాలు కోల్పోయామని ఆఫ్ఘన్‌ ప్రజలు బాధపడుతుంటే, ఇప్పుడే స్వేచ్చాస్వాతంత్ర్యాలు లభించాయని చెపుతూ తాలిబన్లు వారికి శుభాకాంక్షలు తెలియజేయడం వెటకారంగానే అనిపిస్తుంది. తాలిబన్లు దేశాన్ని ఆక్రమించుకొని ప్రభుత్వ పగ్గాలు చేపట్టడంతో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌ పట్ల ఎటువంటి వైఖరి అవలంభించాలి, తాలిబన్ల ప్రభుత్వాన్ని గుర్తించాలా వద్దా? గుర్తిస్తే ఏమవుతుంది?గుర్తించడానికి నిరాకరిస్తే ఏమవుతుంది? అని భారత్‌తో సహా ప్రపంచదేశాలన్నీ ఆలోచిస్తున్నాయి.


Related Post