కేసీఆర్‌ను ప్రసన్నం చేసుకొనేందుకు మోత్కుపల్లి తిప్పలు

August 30, 2021


img

తెలంగాణలో కొంతమంది రాజకీయ దురదృష్టవంతులున్నారు. వారిలో మోత్కుపల్లి నర్సింహులు కూడా ఒకరు. చంద్రబాబునాయుడు గవర్నర్‌ పదవి ఇప్పిస్తారనే ఆశతో అనేక ఏళ్ళపాటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఓ రాజకీయ నాయకుడికి అది రాజకీయంగా ఆత్మహత్యతో సమానం. మోత్కుపల్లి చాలా ఆలస్యంగా ఈ విషయం తెలుసుకొన్నారు. ఇక చేసేదేమీ లేక మళ్ళీ రాజకీయాలలో యాక్టివ్ అయ్యారు. 

రాష్ట్రంలో టిడిపి బలహీనపడటంతో టిఆర్ఎస్‌లో చేరాలని ఆశపడ్డారు. కానీ టిఆర్ఎస్‌ నుంచి ఆహ్వానం రాలేదు. కనుక టిడిపిని టిఆర్ఎస్‌లో విలీనం చేయాలని సూచించి చంద్రబాబు ఆగ్రహానికి గురయ్యి పార్టీ నుంచి బహిష్కరింపపడ్డారు. అప్పుడూ టిఆర్ఎస్‌ వైపు ఆశగా చూశారు కానీ ఆహ్వానం రాకపోవడంతో కొంతకాలం తరువాత బిజెపిలో చేరారు. రెండు నెల్లల క్రితం సిఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో దళిత సాధికారత సమావేశం నిర్వహించినప్పుడు బిజెపి దానిని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించగా ఆయన దానికి హాజరయ్యి బిజెపి ఆగ్రహానికి గురై ఆ పార్టీ నుంచి కూడా బయటకు వెళ్ళవలసివచ్చింది. 

అప్పటి నుంచి మళ్ళీ సిఎం కేసీఆర్‌ను ప్రసన్నం చేసుకొని టిఆర్ఎస్‌లో చేరేందుకు మోత్కుపల్లి దళిత బంధు పధకాన్ని...ఆ ఆలోచన చేసిన సిఎం కేసీఆర్‌ను నిత్యం పొగుడుతూ, పనిలోపనిగా ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.                

బహుశః అటువంటి ప్రయత్నాలలో భాగంగానే నిన్న (ఆదివారం) హైదరాబాద్‌లో తన నివాసంలో ఒక్కరోజు నిరాహార దీక్ష చేశారు. అందుకు ఆయన ఎంచుకొన్న కారణం ఏమిటంటే,  దళిత బంధు పధకాన్ని అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని! ప్రతిపక్షాలు దళిత బంధును అడ్డుకొంటే యాదగిరిగుట్టలో తాన్ ఆత్మహత్య చేసుకొంటానని మోత్కుపల్లి హెచ్చారించారు. ఈ సందర్భంగా ఆయన మళ్ళీ సిఎం కేసీఆర్‌ను పొగిడి, రేవంత్‌ రెడ్డి, బండి సంజయ్‌లపై విమర్శలు గుప్పించారు. 

ఇకనైనా సిఎం కేసీఆర్‌ దయతలిచి మోత్కుపల్లిని టిఆర్ఎస్‌లో చేర్చుకొంటారో లేదో?లేకపోతే ఆయనంత రాజకీయ దురదృష్టవంతుడు మరొకరు ఉండరని భావించవచ్చు.


Related Post