హుజూరాబాద్‌ డ్రామా అందుకే: ప్రవీణ్ కుమార్‌

August 28, 2021


img

బీఎస్పీ నేత ప్రవీణ్ కుమార్‌ శుక్రవారం ఘట్‌కేసర్‌లో తెలంగాణ కార్మికుల సమాఖ్య 14వ మహాసభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “రాష్ట్ర ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పి పుచ్చుకొనేందుకే హుజూరాబాద్‌ ఉపఎన్నికను అతిగా హైలైట్ చేస్తూ దళిత బంధు పధకంతో ప్రజల దృష్టిని మళ్లించాలని ప్రయత్నిస్తోంది. ఈ ఉపఎన్నికలో టిఆర్ఎస్‌, బిజెపిలు కత్తులు దూసుకొంటున్నట్లు నటిస్తున్నప్పటికీ వాటి మద్య లోపాయికారి ఒప్పందం ఉంది. హుజూరాబాద్‌ ఉపఎన్నికలో గెలిచేందుకు రూ.1,000 కోట్లు ఖర్చు చేస్తోంది. ఆ సొమ్మును దళిత విద్యార్దులకు చదువు చెప్పించేందుకు వినియోగిస్తే వారిలో నుంచి ఓ సుందర్ పిచాయ్, ఓ సత్యా నాదెళ్ళ ఉద్భవిస్తారు. మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతున్న బాష చాలా అసభ్యంగా ఉంది. అటువంటి వ్యక్తి రాష్ట్రంలో యూనివర్సిటీలు నడిపిస్తున్నారు. ఎన్నికలోచ్చినప్పుడల్లా ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ అంటూ నిరుద్యోగులను మోసం చేస్తోంది. రాష్ట్రంలో బహుజన రాజ్యం ఏర్పడినప్పుడే ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం లభిస్తుంది,” అని ప్రవీణ్ కుమార్‌ అన్నారు. 

ప్రవీణ్ కుమార్‌ రాష్ట్రంలో అణగారిన వర్గాలకు ముఖ్యంగా దళితులకు నాయకుడిగా ఎదగాలని ప్రయత్నిస్తున్నారు. వారి సహకారంతో రాష్ట్రంలో బీఎస్పీని అధికారంలోకి తీసుకురావాలని భావిస్తున్నారని అర్ధమవుతోంది. అయితే ఒక రాజకీయ నాయకుడు...ఒక పార్టీ నిలద్రొక్కుకోవాలంటే ప్రతీ సభలో అధికార, ప్రతిపక్ష పార్టీలను నిందిస్తే సరిపోదు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ నిర్మాణం చేసుకోవలసి ఉంటుంది. అలాగే మూడు ప్రధాన పార్టీలలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ నేతలు, కార్యకర్తలకు తన నాయకత్వంపై...తన పార్టీపై నమ్మకం కలిగించి వారిని పార్టీలోకి ఆకర్షించగలగాలి. కానీ అదేమీ అంత సులువైన విషయం కాదు. కనుక ప్రవీణ్ కుమార్‌ ముందుగా పార్టీని నిర్మించుకొని దాని సాయంతో ఓ బలమైన కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగవలసి ఉంటుంది. అప్పుడే ఆయన కలలు, ఆశయాలు ఫలిస్తాయి.  


Related Post