తెలంగాణలో రాజకీయ శూన్యత లేకపోయినా...

August 27, 2021


img

దేశంలో అత్యంత సుస్థిరమైన పాలన సాగుతున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమస్థానంలో నిలుస్తుంది. రాష్ట్రంలో అనేక పార్టీలు ఉన్నప్పటికీ అధికార టిఆర్ఎస్‌ తిరుగులేని పార్టీగా నిలిచి ఉంది. కనుక తమిళనాడు వంటి కొన్ని రాష్ట్రాలలోలాగా తెలంగాణ ఎటువంటి రాజకీయ అనిశ్చితి, రాజకీయ శూన్యత లేదు. అయినా రాష్ట్రంలో కాంగ్రెస్‌, బిజెపి, వైఎస్సార్‌టిపి, బీఎస్పీలతో సహా తీన్‌మార్ మల్లన్న వరకు అన్ని పార్టీలు, వ్యక్తులు 2023 శాసనసభ ఎన్నికలలో టిఆర్ఎస్‌ పార్టీని ఓడించి రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని గట్టిగా చెప్పుకోవడం చాలా ఆశ్చర్యకరమైన విషయమే.

తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ రెండో స్థానానికే పరిమితం కాగా, ఆ పార్టీ బలహీనపడటంతో దాని స్థానంలోకి ప్రవేశించిన బిజెపి టిఆర్ఎస్‌కు సవాళ్ళు విసురుతోంది. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికలలో తన సత్తా చాటుకొంది కూడా. కానీ రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ పగ్గాలు చేపట్టడంతో మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్‌, బిజెపిల మద్య రెండో స్థానం కోసం పోటీ మొదలైంది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బిజెపిలే నేటికీ రెండో స్థానం కోసం పోటీ పడుతుంటే, కొత్తగా వచ్చి మూడో నాలుగో స్థానాలలో ఉన్న వైఎస్సార్‌టిపి, బీఎస్పీలు టిఆర్ఎస్‌ను ఓడించగలమని ఏవిధంగా భావిస్తున్నాయో తెలీదు. కానీ అన్ని పార్టీల దృష్టి 2023 శాసనసభ ఎన్నికలపైనే ఉండటం విశేషం. 

అప్పటికి టిఆర్ఎస్‌ ప్రభుత్వం మరిన్ని సంక్షేమ పధకాలు ప్రవేశపెట్టి మరింత బలపడుతుందే తప్ప బలహీనపడదు. పైగా సిఎం కేసీఆర్‌కి ఉన్న ఎన్నికల వ్యూహ నైపుణ్యం ముందు మిగిలిన పార్టీలు వాటి నేతలు బలాదూర్ అని చెప్పక తప్పదు. కనుక వచ్చే శాసనసభ ఎన్నికలలో అన్ని పార్టీలు కలిసి టిఆర్ఎస్‌ సీట్ల సంఖ్యను తగ్గించగలవేమో కానీ ఏ ఒక్కటీ టిఆర్ఎస్‌ను ఓడించి పూర్తి మెజార్టీతో అధికారంలోకి రావడం దాదాపు అసంభవమే అని భావించవచ్చు. కానీ అప్పటిలోగా ఈ టిఆర్ఎస్‌ వ్యతిరేకశక్తులన్నీ ఏకమైతే అప్పుడు టిఆర్ఎస్‌ ఆలోచించుకోవలసి ఉంటుంది.


Related Post