తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పధకం కేవలం దళితుల కొరకే అయినప్పటికీ రాష్ట్రంలో దానిపై జరుగుతున్నంత చర్చ, మరే పధకం, కార్యక్రమంపై జరగడంలేదనే చెప్పాలి. ప్రతిపక్షాలు కూడా దాని గురించి మాట్లాడకుండా ఉండలేని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా హుజూరాబాద్ నుంచి మళ్ళీ పోటీ చేయబోతున్న ఈటల రాజేందర్‌పై దాని ప్రభావం ఇంకా ఎక్కువగా పడింది. ఈ పధకం కింద టిఆర్ఎస్ ప్రభుత్వం నియోజకవర్గంలో దళిత కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.10 లక్షల చొప్పున ఇస్తుంటే ఆయన దానిని వ్యతిరేకించలేని పరిస్థితి ఏర్పడింది. దళితవాడకు వెళ్ళి దళిత బంధు పధకాన్ని వ్యతిరేకిస్తే ఏమవుతుందో తేలికగానే ఊహించుకోవచ్చు.
సిఎం కేసీఆర్ విసిరిన ఈ సవాలును ఎదుర్కోవడానికి ఈటల రాజేందర్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. తన రాజీనామా వల్లనే ఈ పధకం వచ్చిందని లేకుంటే ఎన్నటికీ వచ్చేదే కాదని కనుక ప్రభుత్వం ఇస్తున్న ఆ సొమ్మును తీసుకొని తనకే ఓట్లు వేయాలని ఈటల అభ్యర్ధిస్తున్నారు.
దళిత బంధు ప్రభావంతో ఈటల తన ప్రచార వాహనాలపై బ్యానర్లను కూడా మార్చాల్సి వచ్చింది. దళితవాడలలో తిరిగే వాహనాలపై నీలిరంగులో ఉండే బ్యానర్లపై డాక్టర్ అంబేడ్కర్, జ్యూతీరావు ఫూలే మహనీయుల ఫోటోలు పెట్టి పంపిస్తున్నారు. మిగిలిన ప్రాంతాలలో వాహనాలకు బిజెపి కాషాయరంగు బ్యానర్ దానిపై ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రమంత్రులు అమిత్ షా, కిషన్‌రెడ్డి, బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తదితర బిజెపి నేతల ఫోటోలు పెట్టారు.
ఇంతవరకు హుజూరాబాద్ ఉపఎన్నికలో గెలవడమే ఈటల రాజేందర్‌కు ఓ అగ్నిపరీక్ష అనుకొంటే ఇప్పుడు ఈ దళిత బంధు పధకం మరో అగ్నిపరీక్షగా మారడం విశేషం. టిఆర్ఎస్ విసిరిన ఈ సవాలును ఆయన ఎదుర్కొని హుజూరాబాద్‌లో గట్టెక్కుతారో లేదో చూడాలి.